సభల్లో మాట్లాడే అంశాలపై కేసు పెట్టే హక్కు లేదు

27 Mar, 2014 01:46 IST|Sakshi

పాలకొల్లు అర్బన్, న్యూస్‌లైన్ :
పార్లమెంట్, శాసనసభలలో, బహిరంగ సభలలో మాట్లాడే అంశాలపై కేసు పెట్టే హక్కులేదని, దీని ఆధారంగానే ఒక పార్టీవారు మరో పార్టీ వార్ని విమర్శిస్తున్నారని భారత ప్రభుత్వ సమాచార కమిషనర్ ఆచార్య మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు.పాలకొల్లులోని యార్న్ మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో ‘సమాచార హక్కు చట్టం’పై బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
 
ముఖ్య అతిథి శ్రీధర్ మాట్లాడుతూ 1975లో ఇందిరాగాంధీపై పోటీచేసి పరాజయం పొందిన రాజ్‌నారాయణ ఆమె ప్రభుత్వ అధికారులను ఉపయోగించుకుని ఎన్నికల్లో విజయం సాధించార ని కోర్టును ఆశ్రయిస్తే ఆ ఎన్నిక చెల్లదని తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ అధికారం ఉపయోగించుకుని ఓటర్లను ప్రభావితం చేయకండా ఉండడానికే ఎన్నికల కోడ్ అని వివరించారు.
 
మర్రి చెన్నారెడ్డిపై పోటీచేసిన వందేమాతరం రామచంద్రరావు కూడా ఆయన ఎన్నిక సరైనది కాదని కోర్టుకు వెళ్లటంతో చెన్నారెడ్డికి ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేసే హక్కును రద్దు చేస్తూ కోర్టు తీర్పునిచ్చిందని వివరించారు. 2005లో వచ్చిన సమాచార హక్కు చట్టం ఇప్పుడు అమల్లో వుందని, సామాన్య వ్యక్తి ఈ చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా వివరణ రాతపూర్వకంగా ఇవ్వవలసి ఉందన్నారు.
 
 ఇది ప్రతి భారతీయుడికి లభించిన వరమని శ్రీధర్ చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు టీటీడీ చైర్మన్‌గా ఉండే అర్హత లేదు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా ఉండరాదని, అలాగే  టీటీడీ చైర్మన్‌గా పనిచేసేవారు ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు పోటీ చేయరాదని రాజ్యాంగంలో నిర్దేశించారన్నారు. తమకు వచ్చిన చందాల వివరాలు తెలపమని రాజకీయ పార్టీలను కోరినప్పుడు సీపీఎం, సీపీఐ మినహా ఏ రాజకీయ పార్టీ సమాచారం ఇవ్వలేదన్నారు. ప్రజలతో సంబంధం ఉన్న పార్టీలు వారి జమాఖర్చులను ప్రజలకు తెలియజేయాలని అప్పటి సమాచార కమిషనర్ తీర్పుచెప్పారని పేర్కొన్నారు.
 
సన్మానం...
మాడభూషి శ్రీధర్‌ను, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు దూసనపూడి సోమసుందర్‌ను  ప్రెస్‌క్లబ్ సభ్యులు సన్మానించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జీవీఎస్‌ఎన్ రాజు, జిల్లా కార్యదర్శి వానపల్లి సుబ్బారావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సంకు సుబ్రహ్మణ్యం, బుడిగ గోపి, విన్నకోట వెంకటేశ్వరరావు, కేవీఎస్‌ఎల్ నరసింహరాజు, కాగిత సూర్యనారాయణ పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు