తెలుగు తమ్ముళ్ల భూ దందా

1 Dec, 2014 00:57 IST|Sakshi

మాచర్లరూరల్ : తెలుగుతమ్ముళ్ల భూదందాకు అంతులేకుండా పోతోంది. ప్రభుత్వ భూములే కాకుండా ఫారెస్టు భూములను సైతం కబ్జాచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తపల్లి గ్రామంలోని 534 ఎకరాల ఎద్దులబోడు భూ ఆక్రమణ మరువక ముందే అదే మండలంలో పశువేముల గ్రామంలో 340/1, 341/2, 340 సర్వేనంబర్ల సరిహద్దు ప్రాంతంలో సుమారు 50 ఎకరాల్లో జేసీబీ యంత్రాలతో భూములను చదును చేసి యథేచ్చగా భూదందా కొనసాగిస్తున్నారు. ఆ భూములకు పక్కనే ఉన్న ఫారెస్టు భూములను సైతం కబ్జా చేస్తున్నారు. వీటిపై అధికారులు ఇప్పటి వరకు కన్నెత్తి చూడకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.

మండలంలో సాగు చేసేందుకు భూమి కావాలంటే అధికారులను సంప్రదించటం కంటే ముందుగా రెవెన్యూ పొలాన్ని గుర్తించి ఆ భూముల్లో చొరబడి అనేక ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నామనే దరఖాస్తుతో సులభంగా పట్టా పొందే మార్గాలు అన్వేషిస్తున్నారు. వీరికి అధికార పార్టీకొమ్ముకాస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నారుు. తుళ్లూరు ప్రాంతంలో భూములు అమ్ముకునేవారు ఈ ప్రాంతానికి వచ్చి కొనుగోళ్లు చేపడుతున్నారని తెలియడంతో ఇలాంటి భూములతో కాసులు పోగేసుకోవచ్చని భావిస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువ పరిధిలో 40 ఎకరాల రెవెన్యూ భూమి ఇక్కడ ఉంది. దీని పై ప్రాజెక్టు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. అందుకే అవికాస్తా ఆక్రమణల బారినపడుతున్నారుు.

ఈ విషయమై తహశీల్దార్ గర్నెపూడి లెవీని సాక్షి సంప్రదించగా పశువేములలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములకు గతంలోనే డీకే పట్టాలు ఇచ్చారని తెలిసిందని, అయినప్పటికి ఇంకా ఏమైన ఆ ప్రాంతంలో కబ్జాకు గురైతే వాటిని పరిశీలించి క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ప్రసన్నజ్యోతి మాట్లాడుతూ పశువేముల బీట్ పరిధిలో ఫారెస్టు భూములను కబ్జా చేసిన వారిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే ఈ ప్రాంతం పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. గతంలో కొందరు ఆక్రమణలకు పాల్పడితే ఆ ప్రాంతంలో మొక్కలు నాటి సంరక్షిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు