లైసెన్సు లేదు.. ఫైన్‌ వేస్కోండి!

5 Mar, 2018 09:26 IST|Sakshi

లైసెన్సు ఉన్నా లేవని చెబుతున్న డ్రైవర్లు

వాహన తనిఖీల్లో జరిమానా విధించమంటున్న వైనం

లైసెన్సు సస్పెన్షన్‌ నుంచి తప్పించుకునేందుకు ఎత్తుగడ!

అవాక్కవుతున్న అధికారులు

సాక్షి, అమరావతి : ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడినా తమ డ్రైవింగ్‌ లైసెన్సు సస్పెండ్‌ అవ్వకుండా కొందరు వాహనాదారులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఎంతైనా ఫైన్‌ వేస్కోండి గానీ.. తమకు లైసెన్సు లేదంటూ ఎంచక్కా తప్పించుకుంటున్నారు. తమ తీరుతో రవాణా అధికారులను అవాక్కయ్యేలా చేస్తున్నారు. మితిమీరిన వేగం, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నా, మద్యం తాగి వాహనం నడిపినా.. లైసెన్సు సస్పెండ్‌ చేయాలని గతేడాది సుప్రీంకోర్టు కమిటీ ఆదేశాలిచ్చింది. దీంతో రవాణా శాఖ సస్పెన్షన్లపై గురి పెట్టింది. ఇప్పటివరకు 20 వేల డ్రైవింగ్‌ లైసెన్సులను సస్పెండ్‌ చేసింది. అయితే దీని నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు అసలు తమకు లైసెన్సే లేదని చెబుతున్నారు.

గతేడాది రవాణా శాఖ అధికారులు జరిపిన వాహన తనిఖీల్లో దాదాపు 78,130 మంది తమకు డ్రైవింగ్‌ లైసెన్సులు లేవని చెప్పడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 1.08 కోట్ల మందికి డ్రైవింగ్‌ లైసెన్సులున్నట్లు గణాంకాలుండగా.. ప్రతి వంద మందిలో 70 మంది లైసెన్సు లేదని చెప్పడంతో రవాణా శాఖ అధికారులు అవాక్కయ్యారు. ‘డ్రైవింగ్‌ లైసెన్సు లేదని చెబితే జరిమానా విధించి వదిలేస్తున్నారు. అదే లైసెన్సు ఉందంటే.. ఏకంగా ఆ లైసెన్సును సస్పెండ్‌ చేస్తున్నారు. దీని వల్ల మా ఉపాధి దెబ్బతింటోంది. అదే లైసెన్సు లేదని చెబితే ఉల్లంఘనలకు గానూ రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు జరిమానా చెల్లించి తప్పించుకోవచ్చు..’ అని వాహనదారులు చెబుతుండటం గమనార్హం. కాగా, ఆధార్‌తో డ్రైవింగ్‌ లైసెన్సులను లింక్‌ చేస్తున్నామని.. దీంతో అసలు విషయం తేలిపోతుందని అధికారులు చెబుతున్నారు.

జిల్లా    డ్రైవింగ్‌ లైసెన్సులు లేని వారి సంఖ్య

అనంతపురం    6,426
చిత్తూరు        5,543
వైఎస్సార్‌         1,909
కర్నూలు        7,014
నెల్లూరు        5,311
ప్రకాశం        2,483
గుంటూరు        4,233
కృష్ణా        10,593
పశ్చిమగోదావరి    9,209
తూర్పుగోదావరి    12,755
విశాఖపట్నం    6,541
శ్రీకాకుళం        2,198
విజయనగరం    3,915
మొత్తం        78,130

మరిన్ని వార్తలు