డీఎస్సీ జాప్యమేనా?

27 Nov, 2014 01:46 IST|Sakshi

షెడ్యూలు మాత్రమే విడుదల చేశారు
పోస్టుల సంఖ్య చెప్పినా రిజర్వేషన్లు ప్రకటించలేదు
20 శాతం కోత పెడతారంటూ ప్రచారం
లోకల్, నాన్ లోకల్ కోటా తేలని వైనం

 
మచిలీపట్నం : డీఎస్సీ (టెట్ కమ్ టీఆర్‌టీ) నోటిఫికేషన్ జారీలో జాప్యం జరగనుందా.. ఈ నెల 20న షెడ్యూలును ప్రకటించిన ప్రభుత్వం పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తోందా అన్న అనుమానాలు అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి. డీఎస్సీ పోస్టుల భర్తీలో లోకల్, నాన్ లోకల్ అంశానికి సంబంధించి ప్రభుత్వం బుధవారం సాధారణ పరిపాలనా విభాగాన్ని సంప్రదించినట్లు సమాచారం. నాన్ లోకల్‌కు 20 శాతం, లోకల్‌కు 80 శాతం పోస్టులు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను పరిగణనలోకి తీసుకోవాలా, లేక తెలంగాణా రాష్ట్రంలోని పది జిల్లాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలా అన్న అంశంపై స్పష్టం చేయాలని కోరినట్లు తెలిసింది. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం రాష్ట్రం విడిపోతే టీచర్ పోస్టుల భర్తీలో ఉమ్మడి రాష్ట్రంలోని జిల్లాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధన ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘ నాయకులు చెబుతున్నారు. బీఈడీ అభ్యర్థులను ఎస్‌జీటీ పోస్టుల్లో నియమించే అంశంపైనా స్పష్టత లేదు. దీంతో పాటు ప్రభుత్వం షెడ్యూలులో ప్రకటించిన పోస్టుల్లో 20 శాతం తగ్గించిన అనంతరమే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందనే వాదన వినబడుతోంది. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి పోస్టులను భర్తీ చేస్తామని అప్పట్లో ప్రకటించింది.

సెప్టెంబరు ఐదో తేదీన షెడ్యూలు ప్రకటిస్తామని తెలిపింది. ఆగస్టు నెల చివరిలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతి కోసం ప్రభుత్వం లేఖ రాసింది. సెప్టెంబరు మొదటి వారంలో ఏఐసీటీఈ నుంచి అనుమతి రాకపోవటంతో డీఎస్సీ షెడ్యూలు విడుదలలో జాప్యం జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ పోస్టులు భర్తీ చేసే సమయంలో 13 జిల్లాలకే లోకల్, నాన్ లోకల్‌ను అమలు పరిస్తే తెలంగాణా రాష్ట్రానికి చెందిన పది జిల్లాల అభ్యర్థులు ఈ అంశంపై కోర్టును ఆశ్రయించవచ్చని.. అదే జరిగితే టీచర్ పోస్టుల భర్తీకి బ్రేక్ పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

రిజర్వేషన్లు ఖరారు చేశాకే నోటిఫికేషనా?

జిల్లాలో 379 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఈ నెల 20వ తేదీన విడుదల చేసిన షెడ్యూల్‌లో ప్రకటించారు. స్కూలు అసిస్టెంట్లు, పండిట్లు, ఎస్‌జీటీ పోస్టులు వీటిలో ఉన్నాయి. షెడ్యూల్‌లో పోస్టుల సంఖ్యను ప్రకటించినా రిజర్వేషన్ల వారీగా ఈ పోస్టుల వివరాలను వెల్లడించలేదు. జిల్లాలో భర్తీ చేసే పోస్టులను ఆయా కేటగిరీల వారీగా ఓసీ కోటా, ఆయా సామాజిక వర్గాల కోటా, మహిళల కోటా తదితర అంశాలను ప్రకటించాకే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. పోస్టుల భర్తీలో రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టం చేయకపోవడంతో డీఎస్సీకి సంబంధించి డీటైల్డ్ నోటిఫికేషన్ ఎప్పటికి జారీ అవుతుందనే అంశంపై అనేక అనుమానాలు ఉన్నాయి. రిజర్వేషన్లతో పాటు గిరిజన ప్రాంతాల్లో ఉన్న పోస్టులు, వాటి రిజర్వేషన్లతో పాటు పురపాలక సంఘాల్లో భర్తీ చేసే పోస్టులకు రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉంది.

20 శాతం తగ్గిస్తారా?

డీఎస్సీ షెడ్యూలు విడుదల చేయడానికి ముందు రాష్ట్ర వ్యాప్తంగా 7,631 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకుందని ఉపాధ్యాయ సంఘ నాయకులు చెబుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ఆయా జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సంఖ్యను 9,651కి పెంచారని, డీఎస్సీ షెడ్యూలు విడుదల చేసిన రెండు రోజులకు పురపాలక సంఘాల్లో 1,252 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని ఉపాధ్యాయ సంఘం నాయకులు చెబుతున్నారు. వివిధ కారణాలతో వీటిలో 20 శాతం పోస్టులను తగ్గించి డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేస్తుందనే ప్రచారం జరుగుతుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
 
 

మరిన్ని వార్తలు