చరిత్రాత్మక బిల్లులకు వేదిక

18 Dec, 2019 04:30 IST|Sakshi

నిరవధికంగా వాయిదా పడ్డ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

7 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 22 బిల్లులు ఆమోదం

దిశ బిల్లుకు దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ప్రశంసలు

ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఆర్టీసీ ఉద్యోగులు సర్కారులో విలీనం వంటి కీలక బిల్లులకు ఆమోదం

రాజధానిపై బాబు సర్కారు అవినీతి, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను బహిర్గతం చేసిన ఆర్థిక మంత్రి

సాక్షి, అమరావతి: చరిత్రాత్మక బిల్లులకు వేదికైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మంగళవారం నుంచి నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈనెల 9న ప్రారంభమై 7 రోజుల పాటు జరిగిన ఈ సమాశాల్లో 22 కీలక బిల్లులు ఆమోదం పొందాయి. జూలైలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశా ల్లో 19 బిల్లులను ఆమోదించి చరిత్ర సృష్టించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 22 బిల్లులతో ఆ చరిత్రను తిరగరాసింది. చివరి రోజు మంగళ వారం రాజధాని అమరావతిపై గత చంద్రబాబు సర్కారు అవినీతిని, పక్షపాతాన్ని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా సహా ఎవరెవరు ఎంత భూమి కొన్నారనే విషయాలను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వివరించారు. ఆ తరువాత అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలని, అందులో భాగంగా రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చునని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంచలన ప్రకటన చేశారు. రాజధాని అమరావతిపై స్వల్పకాలిక చర్చ, ముఖ్యమంత్రి సమాధానం తరువాత సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

నిర్మాణాత్మకంగా  వ్యవహరించని ప్రతిపక్షం
ప్రజలకు సంబంధించిన ఏ అంశాల్లోను ప్రధాన ప్రతిపక్షం నిర్మాణాత్మక సూచనలను, సలహాలు ఇవ్వలేకపోయింది. ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్‌ బిల్లులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నేరుగా మాట్లాడకుండా ఇతర అంశాలను తీసుకువచ్చి సభ నుంచి వాకౌట్‌ చేసి వెళ్లిపోవడం గమనార్హం. ఇంగ్లిష్‌ మీడియంపై చర్చ సందర్భంగా ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రకటించిన యుద్ధాన్ని, చంద్రబాబు మళ్లీ యూటర్న్‌ ఎలా తీసుకున్నారనే విషయాన్ని సభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వివరించారు. ఇక రాజధాని అమరావతిపై చంద్రబాబుకు గంటకు పైగా మాట్లాడే అవకాశం వచ్చింది.

అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన సమాధానం చెపుతుండగా ఆ విషయాలు ప్రజల్లోకి వెళ్లకుండా చంద్రబాబు తమ సభ్యులను పోడియం వద్దకు పంపి గొడవ చేయించారు. దీంతో వాస్తవాలు ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం పోడియం వద్ద గొడవ చేస్తున్న తొమ్మిది మంది టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేశారు. దీంతో చంద్రబాబుతో సహా మిగతా టీడీపీ సభ్యులు కూడా సభ నుంచి వెళ్లిపోయారు. కాగా, ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇసుక, ఉల్లిపాయలు, ఇంగ్లిష్‌ మీడియం, మద్య నియంత్రణ,  రైతులకు మద్దతు ధర, సాగునీటి ప్రాజెక్టులు, రివర్స్‌ టెండరింగ్‌ విధానం, గ్రామ, వార్డు సచివాలయాలు తదితర అంశాలపై సవివరంగా చర్చించారు.

‘దిశ బిల్లు’పై దేశవ్యాప్త చర్చ
మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడితే.. 21 పని దినాల్లో విచారణ పూర్తి చేసి తిరుగులేని సాక్ష్యాలు ఉంటే మరణదండన విధించేలా ఈ సమావేశాల్లో తీసుకొచ్చిన దిశ బిల్లుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అలాగే ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేస్తూ మరో రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే చరిత్రాత్మక బిల్లు ఆమోదం పొందడంతో ఆ సంస్థ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. అలాగే దశలవారీగా మద్య నియంత్రణలో భాగంగా అక్రమ రవాణా, విక్రయం, అక్రమంగా తయారు చేస్తే భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధించేందుకు వీలుగా మరో రెండు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించారు. ఇక ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతూ తెచ్చిన మరో కీలక బిల్లును ఈ సమావేశాల్లో ఆమోదించారు.

48 గంటల పాటు అసెంబ్లీ
సాక్షి, అమరావతి: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఏడు పనిదినాల్లో 48 గంటల ఒక నిమిషం పాటు జరిగినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. సమావేశాల ముగింపు సందర్భంగా మాట్లాడిన స్పీకర్‌.. ప్రతిపక్షం చర్చలో పాల్గొనకుండా పదేపదే ఆటంకాలు కలి్పంచడం దురదృష్టకరమని, ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తూ అడ్డుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు