థర్మల్ కార్మికులను గెంటేశారు!

24 Sep, 2015 23:56 IST|Sakshi

సంతబొమ్మాళి: ఈస్టుకోస్టు థర్మల్ యాజమాన్యం కుతంత్రాలు మరోసారి బయటపడ్డాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ప్లాంటులో పనిచేస్తున్న సుమారు 300 మంది కార్మికులను విధుల నుంచి తొలగించి వీధిన పడేశారు. దీంతో వీరంతా థర్మల్ ప్లాంటు మెయిన్ గేటు ముందు గురువారం  ధర్నాను చేపట్టి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలగిస్తున్నట్టు బుధవారం సాయంత్రం నోటీస్ బోర్డులో పేర్లు అంటించి వెంటనే   తొలగించడం అన్యాయమని కార్మికులు మండిపడుతున్నారు. రెండు నెలలుగా జీతం ఇవ్వక పోగా పనుల నుంచి తొలగించడం దారుణమని బాధితులు షణ్ముఖరావు, శ్యామలరావు,
 
 గంగయ్యరెడ్డి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరింపులకు పూనుకుంటున్నారని కార్మికులు ఆరోపించారు. విధుల నుంచి తీసేయాలనుకుంటే 15 రోజుల ముందు సమాచారం ఇవ్వాల్సి ఉండగా..అలా కాకుండా థర్మల్ యాజమాన్యం ఇష్టమొచ్చినట్లు వ్యవహరించి తొలగించారన్నారు. లేబ ర్ కాలనీలో ఉంటున్న బీహార్, ఒడిశా కార్మికులు మాట్లాడుతూ.. తిండి, నీరు ఇవ్వకుండా బయటకు గెంతేసారని ఆవేదన వ్యక్తం చేశారు.  యాజమాన్యం తీరుకు నిరసనగా ప్లాంటు గేటు ముందు కార్మికులు టెంట్ వేశారు.  దీంతో పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట జరిగింది. టెక్కలి సీఐ భవానీప్రసాద్, నౌపడ ఎస్‌ఐ మంగరాజు సంఘటన స్థలానికి వచ్చి కార్మిక నాయకులతో చర్చించడంతో ఆందోళనను కార్మికులు తాత్కాలికంగా విరమించార.
 

మరిన్ని వార్తలు