అక్కడ ఈ ఏడాదీ డిగ్రీ క్లాసులు లేనట్టే..

27 Jun, 2018 08:16 IST|Sakshi
విద్యార్థుల కోసం ఎదురుచూస్తూ కూర్చొన్న జూనియర్‌ అసిస్టెంట్‌ శేఖర్‌

బి కొత్తకోట కళాశాలలో అడ్మిషన్లకు లభించని స్పందన

చేరింది ఇద్దరే విద్యార్థులు వాళ్లు కూడా టీసీలకు ఒత్తిడి

బి.కొత్తకోట: ఈ ఏడాది బి.కొత్తకోట డిగ్రీ కళాశాలలో తరగతులు లేనట్టే. ఇద్దరే విద్యార్థులు చేరేందుకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వాళ్లిద్దరూ   టీసీలు ఇస్తే మరో‡ కళాశాలల్లో చేరుతామంటూ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపల్‌ వెంకట్రామకు విన్నవించారు.  బుధవారం వీరికి టీసీలు  ఇచ్చేయనున్నారు. దీంతో ఈ విద్యాసంవత్సరం డిగ్రీ కళాశాల తరగతులు ప్రారంభం కావన్న విషయం స్పష్టమైంది. 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు డిగ్రీ కళాశాల మంజూరుకు హామీ ఇచ్చారు.  హడావుడిగా ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తూ ఉన్నత విద్యశాఖ ఆదేశాలు జారీచేసింది.  తొలుత బీఏ, బీకాం, కోర్సులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టగా ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఇంటర్‌ టీసీలు ఇచ్చి, రూ.వెయ్యి ఫీజు చెల్లించారు.

మంగళవారం నాటికీ మూడో విద్యార్థి చేరకపోవడంతో తరగతుల ప్రారంభం లేదని తేలిపోయింది. ఈ పరిస్థితిని ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపల్‌ వెంకట్రామ ఉన్నత విద్యశాఖ కమిషనరు సుజాతాశర్మ దృష్టికి తీసుకెళ్లేందుకు మంగళవారం ప్రయత్నించారు.  20న సాక్షిలో ప్రచురించిన ఇద్దరే ఇద్దరు కథనం కమిషనరు దృష్టికి తీసుకెళ్లారు. డిగ్రీ కళాశాలలో చేరేందుకు వచ్చే విద్యార్థుల వివరాలు, దరఖాస్తులను నమోదు చేసేందుకు కోసం కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన జూనియర్‌ అసిస్టెంట్‌ శేఖర్‌ను డెప్యూటేషన్‌పై ఇక్కడికి పంపారు. ఆయన రోజూ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో కూర్చోవడం.. విద్యార్థులు రాకపోవడంతో ఉసూరుమంటూ వెళ్లిపోవడం జరుగుతూ వస్తోంది. తరగతులు ప్రారంభమయ్యే పరిస్థితులు లేనందున శేఖర్‌ను తిరిగి కుప్పంకు పంపించేయనున్నారు.

మరిన్ని వార్తలు