అద్గది.. అలా అడగండన్నా.. | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 27 2018 8:17 AM

YS Jagan Mohan Reddy Motivating The People With His Speeches - Sakshi

ఈ బాటిల్‌లో ఉన్నది చెరుకు రసం కాదన్నా.. మేం తాగే నీరు.. ఇది చంద్రబాబుకు వినిపించేలా చెప్పండన్నా.. – పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో వైఎస్‌ జగన్‌కు నీళ్ల బాటిల్‌ అందిస్తూ మహిళలు వెలిబుచ్చిన ఆవేదన. 

పంట రుణాలన్నీ తీరిపోయి ఆనందంతో గంతులేస్తున్నామట.. అప్పులోళ్లు వెంటపడితే ఉన్న రెండెకరాలు అమ్మేసి, ఇదిగో ఇలా కూలీపని చేస్తున్నాం.. ఆ చంద్రబాబుకు ఈ విషయం అర్థమయ్యేలా చెప్పన్నా..     – భీమవరం వద్ద కూలీగా మారిన ఓ రైతన్న ఆక్రోశం.  
              
బ్యాంకులో పెట్టిన బంగారం మీ ఇంటికి రావాలంటే బాబు సీఎం కావాలి అన్నారు. బాబొచ్చారు.. కానీ బంగారం రాలేదు సరికదా.. వేలం వేస్తామని బ్యాంకు నుంచి నోటీసొచ్చిందన్నా.. – నెల్లూరు నగరానికి సమీపంలో డ్వాక్రా అక్కా చెల్లెమ్మల కన్నీటి గాధ. 
 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ఒకరా.. ఇద్దరా.. వందలు.. వేల మందిది ఇదే గోడు. అడుగడుగునా నిట్టూర్పులే. ఆద్యంతం గుండెను పిండేసే ఆర్తనాదాలే. వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో కనిపించిన దృశ్యాలివి. ప్రజా సంకల్ప యాత్రలో అర్జీ ఇస్తే చాలు.. భవిష్యత్‌లో న్యాయం జరుగుతుందనే నమ్మకం వాళ్లల్లో కనిపించింది. చంద్రబాబు చేసిన మోసాన్ని ఎండగట్టాలన్న కసి కనిపించింది. రగులుతున్న కసిని జననేత జగన్‌ చెవిలో వేస్తే చాలు.. ఆయనే చూసుకుంటాడనే నమ్మకమూ కనిపించింది. ఇన్నిన్ని మోసాలు చేసి లక్షలాది మందిని కష్టాలపాలు చేసిన బాబును జగనన్న నిలదీస్తుంటే చూడాలన్న ఆరాటం వారిలో కనిపించింది. ఈ ప్రభుత్వ హయాంలో ఏ పనీ జరిగే అవకాశమే లేదని, అధికారులూ ఆదుకోలేకపోతున్నారని.. అందుకే ఏమీ చేయలేక, నిస్సహాయంగా ఉన్న తరుణంలో వైఎస్‌ జగన్‌ కొండంత అండగా నిలిచారంటున్నారు.

పులకరించే పలకరింపు..: ‘అసలు సిసలైన నాయకుడిని చూస్తున్నాం.. గుండె లోతుల్లోంచి పలకరించే నైజాన్ని పరిశీలిస్తున్నాం. అభిమానంతో పిలుస్తున్నాడు. ఆత్మీయత పంచుతున్నాడు’ అని పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం దగ్గర రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ పురుషోత్తమరావు ఆనందంతో చెప్పారు. జగన్‌ వద్దకొస్తున్న ప్రతీ సమస్యలోనూ ఆర్ధ్రత ఉంది. ఆవేదన ఉంది. దాన్ని అంతే లోతుగా ఆయన తెలుసుకుంటున్నాడు. అర్జీ ఇవ్వగానే చూస్తాం.. చేస్తాం.. అని తప్పించుకోవడం లేదు. వివరాలు అడిగి మరీ తెలుసుకుంటున్నారని విశ్లేషించారు. ఈ ప్రాంతంలో జరిగిన పాదయాత్రలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ‘పెన్షన్లు, నివాస గృహాలు, అనారోగ్య సమస్యలు, ఉపాధి, ఉద్యోగం.. ఇలా ప్రతి ఒక్కరిదీ ఒక్కో సమస్య. వీరందరూ ఈ ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకం కోల్పోయినవాళ్లే. నాలుగేళ్లు బాధలు పడ్డాం. మరో ఏడాదిలో మంచి రోజులొస్తాయి. జగన్‌ సీఎం అవుతాడనే నమ్మకం వాళ్లల్లో స్పష్టంగా కన్పిస్తోంది’ అని చెప్పారు. సీఎం కాగానే ఏం చేయాలి? ఎవరి బాధను ఎలా పరిష్కరించాలనే ముందు చూపు జగన్‌లో చూస్తున్నామని కర్నూలుకు చెందిన వెంకటయ్య, మదనపల్లికి చెందిన రాములు, నెల్లూరుకు చెందిన యానాదయ్య, గుంటూరుకు చెందిన పుష్ప, విజయవాడకు చెందిన నరసింహులు, రాజమండ్రికి చెందిన సురేష్‌ తదితరులు అభిప్రాయపడ్డారు.

తానే సొంతమై.. కష్టమే తనదై..: నరసాపురం వద్ద 70 ఏళ్ల అవ్వ ఏదో చెప్పాలని వచ్చింది. జనాన్ని దాటుకుని జగన్‌ దగ్గరకెళ్లడానికి విఫలయత్నం చేసింది. ఈ పరిస్థితిని గమనించి జగన్‌ నేరుగా అవ్వ దగ్గరకే వెళ్లారు. గుండెలకు హత్తుకున్నారు. అవ్వ గుక్కపెట్టి ఏడ్చింది. కష్టం చెప్పుకుంది. అవ్వకు జగన్‌ ఇచ్చిన భరోసా ధైర్యాన్నిచ్చింది.  

జననేత మాట.. పేదవాడి పొలికేక : పాదయాత్ర సాగిన ప్రతి రోజు పేదవాడి బాధల్లోంచి వచ్చే ఓ ప్రధాన సమస్యకు జగన్‌ కనెక్ట్‌ అవుతున్నారు. అది పేదవాడి ఆరోగ్యమే కావచ్చు. నిరుద్యోగి పోరాటమే అవ్వొచ్చు. ఆ సమస్యను ఆయన ప్రపంచం వినేలా ఫోకస్‌ చేస్తున్నారు.  ‘మా బడి పక్కే మద్యం షాపు పెట్టారంకుల్‌’ అని పదేళ్ల చిన్నారి పొదలకూరులో జగన్‌ దగ్గరకొచ్చి ధైర్యంగా చెప్పింది. చంద్రబాబును, ఆయన ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించాలని జనం కోరుతున్నారు. అవినీతిని నిగ్గదీయమని జగన్‌ను మరీ మరీ ప్రోత్సహిస్తున్నారు.

Advertisement
Advertisement