బ్యాంకు ఖాతాలపై నిఘా.!

11 Mar, 2019 17:45 IST|Sakshi

ఎన్నికల్లో హైటెక్‌ తరహా నగదు బదిలీ జరగొచ్చని  ఈసీ అనుమానం 

సాక్షి, కడప అగ్రికల్చర్‌ : భారత ఎన్నికల కమిషన్‌ ఆదివారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈసారి ఎన్నికల్లో గెలుపుకోసం హైటెక్‌ తరహాలో నగదు బదిలీ జరగొచ్చనే అనుమానంతో ఎన్నికల కమిషన్‌ ముందస్తు చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో డబ్బులు ఎక్కువ ఖర్చు చేసే రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం కూడా ఒకటని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. దీనిపై నిఘా పెట్టి  క్షేత్రస్థాయిలో బ్యాంకు ఖాతాల వివరాలను ఆరా తీస్తోంది. అ«ధికార తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఓటర్లపై డబ్బుల వర్షం కురిపించే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

ఇప్పటికే జిల్లాలు, నియోజక వర్గాలకు డబ్బు సంచులు చేర్చినట్లు విమర్శలున్నాయి. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లడంతో బ్యాంకు ఖాతాలపై నిఘా పెట్టినట్లు బ్యాంకర్లు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆర్‌బీఐ ద్వారా అన్ని బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించినట్లు సమాచారం.

కొద్ది రోజుల కిందటే ఆయా బ్యాంకు ఖాతాల వివరాలు రాష్ట్ర స్థాయి కంట్రోలింగ్‌ ఆఫీసర్లకు అందినట్లు భోగట్టా. జిల్లాలో ఎన్ని బ్యాంకులున్నాయి, శాఖలు ఎన్ని, ఖాతాదారుల సంఖ్య, జన్‌ధన్‌ ఖాతాల వివరాలు ఆర్‌బీఐ ద్వారా ఎన్నికల కమిషన్‌కు చేరినట్లు సమాచారం. జిల్లాలో 32 బ్యాంకులుండగా, వీటి పరిధిలో 380 బ్యాంకు బ్రాంచీలున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులు, బ్రాంచీలలో కలిపి 30 లక్షల మందికి ఖాతాలున్నాయి. ఇందులో జన్‌ధన్‌ అకౌంట్లు 3.70 లక్షల వరకు ఉన్నాయి.

పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్లాక్‌ మనీ కలిగిన వారు నగదుగా మార్చుకోవడానికి జన్‌ధన్‌ ఖాతాల ద్వారా నగదు బదిలీ చేసుకున్నట్లు విమర్శలున్నాయి.  ఈ ఎన్నికల్లో కూడా పెద్దనోట్ల రద్దు సమయంలో చేసిన విధంగా ఓటర్లకు నగదు బదిలీ చేసి ఓట్లు కొల్లగొట్టే అవకాశాలు ఉన్నట్లు చాలా మందిలో అనుమానాలున్నాయి. 

అధికార పార్టీ డబ్బు సంచులు.. 
ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తరువాత నగదు తరలించడానికి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఇప్పటికే అధికార పార్టీ డబ్బు సంచులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా నాయకులు తమ సన్నిహితులు, అనుచరుల ద్వారా బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మండల, గ్రామ యూనిట్‌గా తీసుకుని ఓటర్ల సంఖ్య, మద్యం,, ఇతర ఖర్చులకు లెక్కగట్టి నగదు నిల్వ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

వ్యాపార సంస్థలు, వాణిజ్యవేత్తలకు పలు బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. కొందరు ఇప్పుడిప్పుడే కొత్త అకౌంట్లు తెరుస్తున్నారు. దీనిని గుర్తించిన ఎన్నికల కమిషన్‌ కొత్త అకౌంట్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా, పట్టణ ప్రాంతాల్లోని మెప్మా గ్రూపులకు చెందిన బ్యాంకు ఖాతాలపై నిఘాకు రంగం సిద్ధం చేశారు. వివిధ కారణాలతో 50 శాతం జన్‌ధన్‌ ఖాతాలు, 20 నుంచి 30 శాతం జనరల్‌ ఖాతాలు వినియోగంలో లేవు.

ఇలాంటి వాటిని అక్రమార్కులు వినియోగించుకునే అవకాశం ఉందని వాటిని క్లోజ్‌ చేసుకునే వి ధంగా చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ అన్ని బ్యాంకులకు సూచినట్లు బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. నగదు జమలను ఎన్నికల కమిషన్‌ నేరుగా గమనిస్తోందని బ్యాంకర్లు చెబుతున్నారు. 
 

మరిన్ని వార్తలు