రోడ్డు కోసం ఎన్నికల బహిష్కరణ

12 Apr, 2019 10:45 IST|Sakshi
ఓటర్లు రాకపోవడంతో ఖాళీగా కూర్చుని ఉన్న పోలింగ్‌ సిబ్బంది, ఓటర్లు రాకపోవడంతో ఖాళీగా కూర్చుని ఉన్న పోలింగ్‌ సిబ్బంది

బురదగల్లికొత్తపాళెంలో ఓటు వేయని ఓటర్లు

వెలగపల్లి వరప్రసాద్‌రావు  చొరవతో పోలింగ్‌ 

మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం

చిట్టమూరు: మండల పరిధిలోని బురదగల్లికొత్తపాళెం పంచాయతీ ఓటర్లు గురువారం సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్‌ మధ్యాహ్నం 2 గంటలకు వైఎస్సార్‌సీపీ గూడూరు అసెంబ్లీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌రావు చొరవతో ప్రారంభమైంది. తమ పంచాయతీలో గత 40 ఏళ్లుగా రోడ్డు సౌకర్యం సక్రమంగా లేకపోవడం, తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు అధికారులకు తెలిపారు. పంచాయతీలో కొత్తపాళెం గ్రామంలో బూత్‌ నంబర్‌ 275లో 1187 ఓట్లు, కుమ్మరిపాళెం బూత్‌ నంబర్‌ 276లో 456 ఓట్లు ఉన్నాయి. అధికారులు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ నిర్వహించేందుకు ఈవీఎంలను సిద్ధం చేశారు.

అయితే ఓటర్లు ఎవరూ రాకపోవడంతో అక్కడి పోలింగ్‌ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి గ్రామస్తులతో చర్చించారు. అయితే సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వనిదే తాము ఓట్లు వెయ్యబోమని తేల్చిచెప్పారు. పంచాయతీలోని కొత్తపాళెం, కుమ్మరిపాళెం, బురదగలిల్లి, పేరపాటితిప్ప గ్రామాల ప్రజలు రాజకీయాలకతీతంగా ఒక్కటై తమ పంచాయతీలో ప్రధానంగా రోడ్డు, తాగునీటి సమస్యలు తీర్చేందుకు కచ్చితమైన హామీ వచ్చేంత వరకు ఓట్లు వేయకూడదని నిశ్చయించుకున్నామని తెలిపారు. అయితే గ్రామానికి గొల్లలనట్టు గ్రామం నుంచి దొరవారిసత్రం మండలం కారికాడు వరకు ఉన్న రోడ్డు అధ్వానంగా ఉందన్నారు.

ఈ రోడ్డు పనులు చేసేందుకు వణ్యప్రాణి సంరక్షణశాఖ(అటవీశాఖ వైల్డ్‌లైఫ్‌) నుంచి తారురోడ్డు పనులు చేయకూడదని ఆంక్షలు ఉన్నాయని, దీంతో ఈ రోడ్డుకు గత కొన్నేళ్లుగా మరమ్మతు పనులు జరగలేదని తెలిపారు. రోడ్డు గంతలమయంగా ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం చేస్తే వైద్యశాలకు తీసుకువెళ్లాలన్నా నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. కొన్ని సందర్భాల్లో సకాలంలో వైద్యశాలకు వెళ్లలేక కొందరు మృతిచెందిన ఘటనలు కూడా ఉన్నాయన్నారు. అలాగే పంచాయతీకి వాకాడు మండలం స్వర్ణముఖి నది నుంచి పైపులైన్ల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతుందన్నారు. అయితే వారానికి ఒక్కసారి మాత్రమే అరకొరగా నీరు సరఫరా అవుతోందని, దీంతో తాగునీటికి అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గుంతల్లోని కలుషిత నీటిని వినియోగించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోయారు. ఈ రెండు సమస్యలు పరిష్కారానికి హామీ ఇస్తే గానీ ఓట్లు వేయబోమని తెగేసిచెప్పారు. 

వరప్రసాద్‌రావు చొరవతో పోలింగ్‌
బురదగల్లికొత్తపాళెం పంచాయతీలో ఓటర్లు ఎన్నికలు బహిష్కరించారన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్‌రావు ఆ పంచాయతీకి చేరుకున్నారు. మీకు అండగా ఉంటాం ముందు ఓటింగ్‌లో పాల్గొనాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ కార్యదర్శి చెన్నారెడ్డి బాబురెడ్డి, జిల్లా కార్యదర్శి వంకా రమణయ్యలతో వరప్రసాద్‌రావు కొత్తపాళెం, కుమ్మరిపాళెం గ్రామాల్లో ఉన్న పోలింగ్‌ బూత్‌లను పరిశీలించారు. వరప్రసాద్‌రావుకు గ్రామస్తులు తమ సమస్యలు తెలియజేశారు. అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో పంచాయతీ ప్రజలు వరప్రసాద్‌రావుపై ఉన్న నమ్మకంతో ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా