జనారణ్యంలోకి గజరాజులు

15 Sep, 2018 12:43 IST|Sakshi
చెరకు తోటలో తిష్టవేసిన ఏనుగుల గుంపు

గుణానుపురం సమీపానికి ఏనుగుల గుంపు

చెరకు తోటలో దర్జాగా తిష్ట

చెరకు, వరి పంటల నాశనం

విజయనగరం, కొమరాడ(కురుపాం): మండలంలోని గుణానపురం గ్రామానికి చేరువలో ఆరు పెద్ద ఏనుగులు, రెండు చిన్న ఏనుగులతో కూడిన గుంపు ఒకటి గురువారం వచ్చింది. గిజబ నుంచి తోటపల్లి రిజర్వాయర్‌లో దిగి ఈదుకుంటూ అవి చెరకు తోటలోకి చేరుకోవడంతో గుణానుపురం, పరశురాంపురం ప్రజలు భయాందోళన చెందుతున్నా రు. వాటిని బయటకు పంపించేందుకు అధికారులు రెండు రోజులుగా కుస్తీ పడుతున్నా ఫలితం లేకపోయింది. ఈ ఏనుగుల గుంపు చెరకును తిన్నంత తిని మిగతాది తొక్కుతూ వరి పొలా లను తొక్కుతూ పంటలను నాశనం చేస్తూ నాగా వళి నదిలోకి వెళ్లి స్నానాలు చేస్తూ సేద తీర్చుకుంటున్నాయి. గురువారం ఉదయం నుండే డీఎఫ్‌ఓ జి.లక్ష్మణ్, పార్వతీపురం ఆర్డీఓ బి. సుదర్శనదొర, కొమరాడ తహసీల్దార్‌ రాజ్‌కుమారి, ఎస్‌ఐ రాజేష్, అటవీశాఖాధికారులు, పోలీసులు, సాయంత్రం 4 గంటల నుంచి శబ్దాలు చేస్తూ వాటిని తరలించడానికి ప్రయత్నం చేస్తున్నా వాటి ని అసలు అవి పట్టించుకోవడం లేదు.

ప్రజలకు హెచ్చరికలు
ఏనుగులకు కనీసం కిలోమీటరు దూరం వరకూ ఎవరూ వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటికి దూరంగా ఉండాలని మైక్‌లో హెచ్చరికలు జారీచేస్తున్నారు. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏనుగులను తరలించకపోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తమ పంటలు నాశనం అవుతున్నాయని లబోదిబోమంటున్నారు.

భయాందోళనలో ప్రజలు...
గ్రామాల్లోకి ఏనుగులు చేరుకోవడంతో పంటలను నాశనం చేయడమే గాకుండా రైతులు, ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన ఎవరిపై దాడిచేస్తాయో, ఏ పంట పొలాలను తొక్కి పడేస్తాయోతెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.  

ఒకరిపై దాడి..
మండలంలోని అర్తాం గ్రామానికి చెందిన సత్యనారాయణ రాజుపై ఏనుగులు దాడిచేసి కుడికాలును తొండంతో కొట్టాయి. చెరకు తోటలో ఉన్న ఏనుగులను చూసేందుకు వెళ్లిన సత్యనారాయణ రాజుపై చేసిన దాడివల్ల కాలికి గాయమైంది. ఆయన్ను కుటుంబ సభ్యులు పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు