ఉన్నత విద్యకు నెలవు.. ఉపాధికి కొలువు

10 May, 2018 11:24 IST|Sakshi

వైవీయూసెట్‌–2018

దరఖాస్తుకు 15 వరకు గడువు

జూన్‌ మొదటివారంలో పరీక్షల నిర్వహణ

ఉద్యోగ, ఉపాధి కోర్సులకు యోగివేమన విశ్వవిద్యాలయం నెలవుగా మారుతోంది.. సంప్రదాయ కోర్సులతో పాటు వృత్తివిద్యా కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడంతో విశ్వవిద్యాలయంలో చేరే విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ప్రవేశపరీక్షను జూన్‌ మొదటివారంలో నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

వైవీయూ : ప్రతిష్టాత్మక యోగివేమన విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు వైవీయూ సెట్‌–2018కు దరఖాస్తు చేసుకునే గడువు మరో 5 రోజుల్లో ముగియనుంది. 2006లో ప్రారంభించిన ఈ విశ్వవిద్యాలయం నేడు 32 రకాల కోర్సులు అందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైవీయూసెట్‌–2018కి సంబంధించి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, దరఖాస్తు చేసుకునేందుకు మే నెల 15తో గడువు ముగియనుంది. అపరాధ రుసుంతో ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఆన్‌లైన్‌లో చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన మరుసటి రోజు వెబ్‌సైట్‌లో వివరాలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, పూర్తిచేసిన దరఖాస్తులను మే నెల 23వ తేదీలోపు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు డబ్ల్యూడబ్ల్యూడబ్లూయ.వైవీయూడీఓఏ.నెట్‌ వెబ్‌సైట్‌లో సంప్రదిస్తే పూర్తి వివరాలు లభిస్తాయి. జూన్‌ మొదటివారంలో ఈ పరీక్షను యోగివేమన విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో మాత్రమే నిర్వహిస్తారు.

లభించే కోర్సులు.. నిర్వహించే పరీక్షలు...
యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో 32 రకాల కోర్సులు అందుబాటులో ఉండగా వీటిలో ప్రవేశం పొందేందుకు 17 పరీక్షలను (సబ్జెక్ట్‌ల వారీగా) నిర్వహించనున్నారు. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనిటిక్స్‌ అండ్‌ జీనోమిక్స్, మైక్రోబయాలజీ, ఎంఎస్సీ బోటనీ (ప్లాంట్‌సైన్స్‌), కెమిస్ట్రీ (ఆర్గానిక్‌), ఎంఎస్సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, ఎంకాం, ఎంఎస్సీ కంప్యూటర్‌ సైన్స్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఈడీ, ఎంఏ ఇంగ్లిష్, ఎంఎస్సీ జియాలజీ, ఎంఏ హిస్టరీ అండ్‌ ఆర్కియాలజీ, ఎంఏ జర్నలిజం, ఎంఎస్సీ సైకాలజీ, ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ నానోటెక్నాలజీ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ మ్యాథమ్యాటిక్స్, ఎంఎస్సీ స్టాటిస్టిక్స్‌(కంప్యూటర్‌ అప్లికేషన్‌), ఎంపీఈడీ, ఎంఏ తెలుగు, ఎంఎస్సీ జువాలజీ (అనిమల్‌ సైన్స్‌), ఎంఎస్సీ బయోటెక్నాలజీ అండ్‌ బయోఇన్ఫర్మాటిక్స్‌ (5సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు), ఎంఎస్సీ ఎర్త్‌సైన్స్‌ (5సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు), ఎంఏ రూరల్‌ డెవలప్‌మెంట్, ఎంఏ ఉర్దూ, ఎంఎస్సీ ఫుడ్‌టెక్నాలజీ, ఎంఎస్సీ కంప్యూటేషనల్‌ డాటా సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ)లో ప్రవేశానికి ఫైన్‌ఆర్ట్స్‌పేరుతో నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ థియేటర్‌ ఆర్ట్స్‌లో ప్రవేశానికి మౌఖిక పరీక్ష ద్వారా ప్రవేశాలు నిర్వహిస్తారు.

ప్రవేశం పొందేందుకు అర్హులు ఎవరంటే..
ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీలో సంబంధిత గ్రూపు సబ్జెక్టులో 40 శాతం మార్కులు, ఎంఈడీలో ప్రవేశాలకు బీఈడీలో 50 శాతం మార్కులు, ఎంపీఈడీలో ప్రవేశానికి బీపీఈడీలో 40 శాతం మార్కులు ఉండాలి. ఇంటర్మీడియట్‌ అర్హతతో 5 సంవత్సరాల ఇంటిగ్రేడెట్‌ కోర్సుల్లో చేరే అవకాశం కూడా విద్యార్థులకు ఉంది. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 50 శాతం మార్కులు పొంది ఉంటే ప్రవేశాలు పొందవచ్చు. 

మరిన్ని వార్తలు