‘ఉపాధి’కెళ్తే కేసులా?

20 Jan, 2014 00:23 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి: కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వర్గీయుల మధ్య ఆధిపత్య పోరులో ఓ గ్రామ ఉపాధి కూలీలు నలిగిపోతున్నారు. పొట్టకూటి కోసం ‘ఉపాధి’ పనులు చేసిన పాపానికి ఆ గ్రామంలో 10 మంది కూలీలు కేసులు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నుల్లో నడుచుకుంటున్న అక్కడి పోలీసులు ప్రత్యర్థి వర్గాన్ని దెబ్బతీసేందుకే కూలీలపై కేసులు నమోదు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 తొగుట మండలం వెంకట్రావుపేటలో పంచాయతీ ఎన్నికలు రగిల్చిన విభేదాలు ఇంకా ఆరలేదు. సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందిన, ఓడిపోయిన వర్గీయుల ఆధిపత్య పోరుకు దిగుతుండడంతో గ్రామంలో తరచూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ వర్గీయులు 10 రోజుల కింద వెంకట్రావుపేట-చందాపూర్ మధ్య గల ఆర్‌అండ్‌బీ రోడ్డుకు అడ్డంగా మట్టిని పోసి మూసివేశారు. దీంతో టీఆర్‌ఎస్ మద్దతు గెలిచిన సర్పంచ్ వర్గీయులు మట్టిని తొలగించి మార్గాన్ని పునరుద్ధరించారు. మళ్లీ అధికార పార్టీ వర్గీయులు రోడ్డుకు అడ్డంగా సిమెంటు పైపులు వేసి మూసివేసే ప్రయత్నం చేయగా.. ప్రత్యర్థి వర్గీయులు పోలీసుల సహాయంతో తొలగించారు. ఈ వివాదం చినికి చినికి గాలి వానలా మారి ఉపాధి కూలీలపై కేసుల నమోదుకు దారితీసింది.

 గ్రామ పరిధిలో గల మల్లన్న గుట్ట చుట్టూ మట్టి రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ కింద ఇటీవల రూ.7.34 లక్షల వ్యయంతో పనులు మంజూరయ్యా యి. ఈ నెల 16న దాదాపు 50 మంది కూలీలు ఈ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించగా కొంతమంది గ్రామస్థులు అడ్డుకుని తమ భూముల్లో రోడ్డు వేస్తున్నారని ఆరోపించడంతో పనులు నిలిపివేశారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదుపై తొగుట పోలీసులు అదే రోజు వివిధ సెక్షన్ల కింద 11 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో 10 మంది ఉపాధి కూలీలే ఉన్నారు. పొట్ట కూటి కోసం పనులు చేయడానికి వచ్చి కేసుల్లో చిక్కుకున్నారు.

 వాళ్లు ఉపాధి కూలీలే..  
 మల్లన్న గుట్ట చుట్టూ రోడ్డు నిర్మించాలని గ్రామ సభ ద్వారా చాలా కాలం కిందే తీర్మానం చేశారని తొగుట ఏపీఓ శైలజ తెలిపారు. పని ప్రారంభించిన తర్వాత కొందరు రైతులు అడ్డుకుని తమ భూముల్లో రోడ్డు వేస్తున్నారని ఆరోపించారన్నారు. తహశీల్దార్ సర్వే జరుపుతామని చెప్పారన్నారు. అందులో కొందరి పట్టా భూమి కూడా ఉన్నట్లు చెబుతున్నారని చెప్పారు. అదే విధంగా కేసు ఎదుర్కొంటున్న 10 మంది ఉపాధి కూలీ లే. ఉపాధి హామీ కింద పనిచేయడానికి వచ్చినవాళ్లేనని శైలజ తెలిపారు.    

 పట్టా భూమిలో రోడ్డు వేసినందుకే కేసు:  తమ భూముల్లో దౌర్జన్యంగా రోడ్డు వేశారని రైతులు ఫిర్యాదు చేయడంతో కేసు పెట్టాం. తహశీల్దార్ పంచనామా నిర్వహించి పట్టా భూమిగా ధ్రువీకరించారు. వెంకట్రావుపేట సర్పంచ్ కుమారుడు రాంరెడ్డి తన అనుచరులతో కలిసి గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే రోడ్డు వేశారు. జాబ్ కార్డులు అందరికీ ఇచ్చారు. వీటిని చూపించుకుని నిందితులు ఉపాధి కూలీలుగా చెప్పుకుంటున్నారు. - రమేశ్‌బాబు, తొగుట సీఐ

>
మరిన్ని వార్తలు