ఉపాధి ఆఫీస్‌ ఇలాగేనా..!

20 Dec, 2019 13:11 IST|Sakshi
మచిలీపట్నం కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఉన్న ఉపాధి కల్పన కార్యాలయం

శిథిల భవనంలో కార్యాలయం

మూలన పడ్డ కంప్యూటర్‌ సామగ్రి

సకాలంలో గుర్తింపునకు నోచుకోని వైనం

వారానికి ఓ రోజు సిబ్బంది విజయవాడకు పయనం

పీజీ కోర్సు నమోదుకు విశాఖ వెళ్లాల్సిందే

మచిలీపట్నం: జిల్లా కేంద్రమైన మచిలీపట్నం కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఉన్న ఉప– ఉపాధి కల్పన కార్యాలయం బూత్‌ బంగ్లాను తలపిస్తోంది. తుఫాన్‌ బాధితుల కోసమని ఎప్పుడో నిర్మించిన భవనంలో చాలా కాలంగా కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు.  టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆశించిన స్థాయిలో ఉద్యోగ నియామకాలు లేక, ఉపాధి కార్యాలయాలకు పనిలేకుండా పోయింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం కొలువుల జాతరకు తెరలేపటంతో వీటికి మళ్లీ మంచి రోజులు వచ్చినట్‌లైంది. భవిష్యత్‌లోనూ ఉద్యోగ నియామకాలు ఒక నిర్ధిష్టమైన క్యాలెండర్‌ ప్రకారం నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో నిరుద్యోగులు తమ విద్యార్హతల నమోదు కోసమని ఉపాధి కార్యాలయానికి వస్తున్నారు. కానీ మచిలీపట్నం ఉప ఉపాధి కల్పన కార్యాలయంలో నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారు. విజయవాడ కేంద్రంగా జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఉంది. అయితే మచిలీపట్నం, గుడివాడ రెవెన్యూ డివిజన్‌ల పరిధిలోని మండలాలకు చెందిన నిరుద్యోగులు అందుబాటులో ఉండే విధంగా మచిలీపట్నం కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఉప– ఉపాధి కల్పన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ కార్యాలయ కార్యకలాపాల నిర్వహణ కోసమని జూనియర్‌ ఎంప్లాయిమెంట్‌ అధికారి, అతడికి సహకారం అందించేందుకు ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ పనిచేస్తున్నారు. ప్రస్తుతం అటెండర్, వాచ్‌మెన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కార్యాలయం నిర్వహిస్తున్న భవనం పాడుబడిన బంగ్లా మాదిరే కనిపిస్తోంది. అందులో కార్యాలయం ఉందనే విషయాన్ని బోర్డు చూస్తేనే కానీ గుర్తించటం నిరుద్యోగులకు కష్టతరంగానే ఉంది. 

మూలనపడేశారు..  
మచిలీపట్నం ఉప– ఉపాధి కల్పన కార్యాలయానికి ప్రతి రోజు పది నుంచి పదిహేను మంది వరకు అభ్యర్థులు తమ విద్యార్హతలను నమోదు చేయించుకునేందుకు వస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 6 వందల దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి సానుకూలంగా ఉండటంతో నమోదు కోసమని వచ్చే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుందని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే వచ్చిన వారి వివరాలను నమోదు చేసుకొని, వారి ధ్రువీకరణ పత్రాలన్నింటినీ తీసుకొని, ఇక్కడి అధికారులు వారంలో ఒక రోజు విజయవాడ జిల్లా కార్యాలయానికి వెళ్తున్నారు. అక్కడ కంప్యూటరీకరణ చేసి, ఎంప్లాయిమెంట్‌ కార్డులను తీసుకొచ్చి ఇక్కడ తిరిగి అభ్యర్థులకు అందజేస్తున్నారు. మచిలీపట్నంలో కూడా నమోదుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని అభ్యర్థులు
కోరుతున్నారు. 

పీజీ కోర్సు నమోదుకు ..
మచిలీపట్నం ఉప– ఉపాధి కల్పన కార్యాలయంలో పదో తరగతి నుంచి డిగ్రీ వరకు అదే విధంగా బీయిడ్, డీయిడ్‌ వంటి కోర్సులకు మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కానీ పీజీ, ఇతర ప్రొఫిషనల్‌ కోర్సులను నమోదు చేయించుకోవాలంటే విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలోని ఉపాధి కల్పన కార్యాలయానికి అభ్యర్థులు వెళ్లాల్సి వస్తోంది. విజయవాడలో కూడా ఇటువంటి సౌకర్యం లేకపోవటంతో జిల్లాకు చెందిన అభ్యర్థులు వ్యయ, ప్రయాసలకోర్చి విశాఖకు వెళ్లాల్సివస్తోంది. దీనిపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.  

ఇబ్బందులు లేకుండా చర్యలు
విద్యార్హతలు నమోదు కోసమని వచ్చే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి శనివారం విజయవాడ తీసుకెళ్లి, అక్కడ ఆన్‌లైన్‌లో నమోదు చేయించి. గుర్తింపు పత్రాలను అభ్యర్థులకు తామే అందజేసేలా శ్రద్ధ తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఎంప్లాయిమెంట్‌ చేయించుకునేందుకు బాగానే వస్తున్నారు. –డీ విక్టర్‌ బాబు,జూనియర్‌ ఎంప్లాయిమెంట్‌ అధికారి

మరిన్ని వార్తలు