బంపర్‌ ఆఫర్‌..!

16 May, 2018 12:48 IST|Sakshi

 ఇంటర్‌ ఫెయిల్‌ అయ్యారా.. మేమే పాస్‌ చేయిస్తాం

మా కళాశాలలో చేర్పించండి

అన్నీ మేమే చూసుకుంటాం !

ఇంజినీరింగ్‌ కళాశాలల తీరుపై నోరెళ్లబెడుతున్న తల్లిదండ్రులు

ఇంటర్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థుల చుట్టూ ప్రదక్షిణలు

ప్రకాశం, కందుకూరు రూరల్‌: రాను రాను ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. దీంతో అడ్మిషన్లు చేసేందుకు కళాశాలలు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్‌ పాస్‌ అయి, ఎంసెట్‌ రాసిన విద్యార్థులను మా కళాశాలలో చేరండని ఫోన్లు ద్వారా, నేరుగా ఇళ్లకు వెళ్లి అడుగుతున్నారు. కళాశాలలో చేర్పించే వరకు తల్లిదండ్రుల ప్రాణాలు తోడేస్తున్నారు. అయినా అడ్మిషన్లు సరిగా కాకపోవడంతో నేరుగా ఇంటర్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంటర్‌లో ఎన్ని సబ్జెక్టులు పోయినా సరే పరీక్ష సెంటర్‌ చెప్పండి మేము పాస్‌ చేయిస్తాం. అయితే మా కళాశాలలో చేర్పించండని అడ్మిషన్లు చేయించుకుంటున్నారు. కళాశాలల నుంచి వచ్చే పీఆర్వోలు, ఆయా కళాశాలల అధ్యాపకులు ఇలాంటి ఆఫర్లు ఇస్తుండడంతో తల్లిదండ్రులు నోరెళ్ల పెడుతున్నారు. ఇంటర్‌ పాస్‌ అయిన వారిని మేము పాస్‌ చేయిస్తామని ఇంజినీరింగ్‌ కళాశాలల వారు తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతూ అడ్మిషన్ల కోసం నగదు కూడా కట్టించుకుంటున్నట్లు సమాచారం.

ఈ విధంగా ఇంజినీరింగ్‌ కళాశాలల వారు ప్రస్తుతం జరుగుతున్న అడ్వాన్స్‌ సప్లమెంటరీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. పరీక్ష కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌ జరుగుతున్నట్లేనని అర్థమవుతోంది. ఫెయిల్‌ అయినా ఇంటర్‌ విద్యార్థుల పరీక్ష సెంటర్లను ఇంజినీరింగ్‌ కళాశాలల వారు ఏ విధంగా మేనేజ్‌ చేస్తున్నారోనని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంజినీరింగ్‌ పరిస్థితి రోజు రోజుకూ దిగజారడమే దీనికి కారణమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇదిలా ఉంటే ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థుల ఫోన్‌ నంబర్లను ఆయా జూనియర్‌ కళాశాలల నుంచి సేకరించి నేరుగా ఫోన్లు చేస్తున్నారు. మా కళాశాలలో ఈ కోర్సులు ఉన్నాయి... ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి ఫీజులు అవసరం లేదు... స్కాలర్‌ షిప్‌ వస్తుంది అన్నీ కళాశాల వారే చూసుకుంటారని ఫోన్లు చేస్తున్నారు. ఈ ఫోన్ల తాకిడికి తల్లిదండ్రులు తట్టుకోలేక ఫోన్లు స్విచ్‌లు ఆఫ్‌ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫోన్లే కాకుండా మెసేజ్‌లు కూడా రోజుకు ఇరవై.. ముప్పై వస్తున్నాయి.

మరిన్ని వార్తలు