జూలై 7 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్

24 Jun, 2014 03:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను జూలై 7వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో సాంకేతిక విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అయితే ఫీజు రీయెంబర్స్‌మెంట్‌కు సంబంధించిన స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు పాత ప్రవేశాల విధానం అమల్లో ఉంటున్నందున రెండు రాష్ట్రాల్లో ఫీజు రీయెంబర్స్‌మెంట్, కొత్త కాలేజీల అనుమతుల వ్యవహారం ఆలోగానే తేల్సాల్సి ఉంది. మరోవైపు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి కొత్త కాలేజీలకు ఇచ్చే అనుమతుల వివరాలు త్వరలోనే రానున్నాయి. ఈనెల 29 నుంచి కౌన్సెలింగ్‌ను ప్రారంభించాలని గతంలోనే నిర్ణయించినా కొత్త కాలేజీల అనుమతులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తర్వులు జారీ కావాల్సి ఉన్నందున కౌన్సెలింగ్‌ను వాయిదా వేసింది.
 
 ఈనెల 28 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్
 ఇదిలాఉండగా, డిప్లొమా విద్యార్థులకు ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు ఉద్దేశించిన ఈసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఈనెల 28 నుంచి చేపట్టాలని ఉన్నతవిద్యామండలి నిర్ణయించింది. 28వ తేదీ నుంచి జులై 3వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని, 5వ తేదీన సీట్లు కేటాయించాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు