ఇంజినీరింగ్‌ చదువుతూ.. మతిస్థిమితం లేని దశకు..!

23 Oct, 2019 10:53 IST|Sakshi
రాజేష్‌ను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న రోడ్‌ సేఫ్టీ సిబ్బంది 

కుటుంబం చెంతకు మతిస్థిమితం లేని యువకుడు

మతి స్థిమితం లేని యువకుడిని చేరదీసిన రోడ్‌సేఫ్టీ పోలీసులు 

సమాచారం అందించి తల్లిదండ్రులకు అప్పగింత

సాక్షి, ఉలవపాడు: రోడ్‌సేఫ్టీ పోలీసుల మానవత్వం ఓ యువకుడిని తన సొంత ఇంటికి చేర్చింది.  మతి స్థిమితం లేకుండా జాతీయ రహదారిపై తిరుగుతున్న యువకుడిని చేరతీసి సమాచారం సేకరించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాలలోకి వెళితే ప్రకాశం జిల్లా.. ఉలవపాడు, గుడ్లూరు మండలాలకు కలిపి ఏర్పాటు చేసిన రోడ్డుసేప్టీ వాహనంలో కానిస్టేబుళ్లు ప్రసాద్, బ్రహ్మయ్యలు విధుల్లో భాగంగా జాతీయ రహదారిపై బీట్‌ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ యువకుడు తడుస్తూ కనిపించాడు. తొలుత అనుమానించలేదు. మరలా తిరిగివస్తున్న సమయంలో కూడా అలానే కనిపించడంతో సోమవారం ఉదయం అతనిని దగ్గరకు తీసుకున్నారు.  ముందు ఉలవపాడు హోటల్‌లో టిఫిన్‌ పెట్టించారు. తమ వాహనంలోనే ఉంచుకుని సమాచారం అడిగారు. మధ్యాహ్నం, రాత్రి కూడా భోజనం పెట్టించారు. అతని వద్ద ఆధార్‌ కార్డు ఉండడం గమనించి కార్డుతీసుకుని అతని ఫొటోలు తీసి అక్కడ ఉన్న వారికి పంపించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు గుర్తించి మంగళవారం ఉదయం ఉలవపాడుకు వచ్చారు. వచ్చిన తరువాత  ఆ యువకుడు అలా మతిస్థిమితం లేకుండా తిరగడానికి గల కారణాలు, ఆ కుటుంబం పడుతున్న బాధలను తల్లిదండ్రులు వివరించారు.

ఇంజినీరింగ్‌ చదువుతూ.. మతిస్థిమితం లేని దశకు...
ప్రకాశం జిల్లాలోని పుల్లలచెరువు మండలం రాచకొండ గ్రామంలోని ఉమ్మడివరం కాలనీకి చెందిన కందుకూరి రాములు, సృజనల కుమారుడు కందుకూరి రాజేష్‌. 2012 లో విజయవాడలోని ఆర్‌.కె ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ చేరాడు. మూడో సంవత్సరం చదువుతున్న సమయంలో గొడవ జరిగింది.  కళాశాలలో తల పై కొట్టడంతో గాయపడ్డాడు. ఆ తరువాత అక్కడ నుంచి ఇంటికి వచ్చేశాడు. అప్పటి నుండి క్రమంగా మతి స్థిమితం లేకుండా తయారవుతున్నాడు. ఈ పరిస్థితులో హైదరాబాద్, బెంగళూరు ఇలా పలు చోట్ల చూపించారు. అయినా తగ్గలేదు. తరువాత ఆరోగ్యం బాగాలేకపోవడంతో  ఈ ఏడాది ఏప్రిల్‌ 14న ఒంగోలు రిమ్స్‌ లో చేర్చారు. అక్కడే 21 వరకు ఉన్నాడు. వైద్యశాలలో తల్లి నిద్రపోతున్న సమయంలో పారిపోయి బయటకు వచ్చేశాడు. అప్పటి నుంచి మతి స్థిమితం లేకుండా ఇలా రోడ్ల పై తిరుగుతూనే ఉన్నాడు. అప్పటి నుంచి వారి తల్లితండ్రులు వెతికినా ఆచూకీ కనపడలేదు. ఈ పరిస్థితుల్లో రోడ్‌సేఫ్టీ పోలీసులు గుర్తించి అతనితో మంచిగా మాట్లాడుతూ దాదాపు 12 గంటలు ఉంచుకున్న తరువాత తన అడ్రస్‌కు సంబంధించి కార్డును చూపించాడు.

తల్లిదండ్రులకు అప్పగింత...
ఇక్కడ తీసిన ఫొటోలను అక్కడి పోలీసులకు, మిత్రులకు రోడ్‌ సేఫ్టీ సిబ్బంది వాట్సప్‌ ద్వారా పంపించారు. వారి తల్లితండ్రులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వారి తల్లితండ్రులు  కందుకూరి రాములు, సృజనలు ఆ ఫోటోలు చూసి తమ కుమారుడిని గుర్తించారు. వారి కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం రావడంతో రోడ్‌సేఫ్టీ పోలీసు సిబ్బంది ప్రసాద్, బ్రహ్మయ్యలు రాజేష్‌ను వారికి అప్పగించారు. కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు