నేనున్నానని..

15 Oct, 2014 01:26 IST|Sakshi
నేనున్నానని..
  • తుపాను బాధితులకు జగన్ భరోసా
  •  వరద ప్రాంతాల్లో పర్యటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత
  •  అడుగడుగునా కష్టాలు చెప్పుకున్న బాధితులు
  •  న్యాయం జరిగేంత వరకూ పోరాటం : ప్రతిపక్ష నేత
  •  అధైర్య పడొద్దని ప్రజలకు పరామర్శ
  • సాక్షి, విశాఖపట్నం: ‘‘ఐదుగురు పిల్లలతో పందిరి గూడేసుకుని బతకతన్నాం అయ్యా.. నా భర్త ఏడేళ్ల క్రితమే పోనాడు. పింఛన్ రాట్లేదు. ఇప్పుడు తుఫానుకు ఆ పందిరి ఎగిరిపోనాది. కూలిన ఇల్లు ఉంటే చూపించు నష్టపరిహారం రాస్తానంటున్నారు. ఎగిరిపోయిన గూడును నెనెక్కడినుంచి తేవాలా?. మాకు బతికే దారిలేదయ్యా’అంటూ గనగల కొర్లమ్మ అనే మహిళ పూడిమడకలో సముద్రం వద్ద జగన్‌మోహన్‌రెడ్డికి తన కష్టాన్ని చెప్పుకుంది.
     
    ‘‘బాబూ..ఇల్లు పడిపోనాది. కూడులేదు. గంజినీళ్లు కూడా లేవు బాబూ.. మమ్మల్ని చూణ్ణానికి కూడా ఏరూ రానేదు. నువ్వే వచ్చావు నాయనా. మా కష్టాలు ఏలా ఉన్నావో చూడయ్యా.’’అంటూ దేసుడు సూరమ్మ అనే వృద్ధురాలు అచ్యుతాపురంలో  జగన్‌ను చూసి గుండెలుబాదుకుంది.’’ఇలా ఒకరు కాదు కాదు ఇద్దరు కాదు వేలాదిమంది హుధూద్ తుఫాను బాధితులు మంగళవారం తమను పరామర్శించడానికి వచ్చిన జగన్‌కు తమ కష్టాలు ఏకరవుపెట్టారు. తుఫాను విలయతాండవానికి సర్వస్వం కోల్పోయిన తీర ప్రాంత ప్రజలను ప్రతిపక్షనేత,  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలకరించారు.

    తూర్పుగోదావరి జిల్లా నుంచి సాయంత్రం 3.30 నిమిషాలకు నక్కపల్లి మీదుగా నారాయణపురం చేరుకున్న జగన్ ఎలా ఉన్నారంటూ తమ అక్కడి ప్రజలను పలకరించారు. పాకలన్నీ పడిపోయాయని, రోడ్డుమీదే కాలం గడుపుతున్నామని వారు చెప్పారు. అక్కడి నుంచి కొత్తూరు శారదానదిని దాటుకుని ఎదురువాడ, అచ్చుతాపురం మీదుగా పూడిమడక వచ్చారు. కొండపాలెంలో మహిళలు జగన్ చూడగానే ఎదురువచ్చి తమ కష్టాలు ఎకరువుపెట్టారు. 10కేజీల బియ్యం ఇస్తామని రెండు కేజీలు తగ్గించి కొందరికి ఇచ్చారని, తిండిలేక పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.

    ‘మిమ్మల్ని పట్టించుకునేందుకు ఎవరైనా వచ్చారా తల్లి’ అని జగన్ అడిగగా ఇప్పటి వరకూ ఏ నాయకుడు రాలేదని అక్కడి ప్రజలు వాపోయారు. బోటు బద్దలయ్యిందని, తన జీవనాధారం పోయిందని ఆసుపల్లి సత్యవతి దుఃఖపర్యంతమయ్యింది.తినడానికి తిండిలేదని మారి గంజామ్ చెబుతుంటే అక్కడి ప్రజల ధీన స్థితికి జగన్ చలించిపోయారు.

    పిల్లలతో మేమెలా బతకాలి బాబూ అంటూ మైలపల్లి కాసమ్మ కన్నీరు పెట్టుకుంది. లంగరు వేసిన బోట్లు తీరానికి కొట్టుకుని వచ్చాయని, కొన్ని సముద్రంలో కలిసిపోయాయని చేపల శ్రీరాములు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. సముద్ర తీరంలో నడుస్తూ పాడైన బోట్లను జగన్ పరిశీలించారు. ఆ సమయంలో ‘వస్తాడు వస్తాడు జగనన్న..బంగారు పల్లకిలో..మా కష్టాలు తీర్చేందుకు’అంటూ మత్య్సకార యువకులు సంప్రదాయ రీతిలో గీతాలను ఆలపించారు. ఇంత కష్టంలోనూ తమను ఆదుకునే నేత జగన్ అనే నమ్మకం ఆ పాటల్లో కనిపించింది.

    అక్కడ ఉన్న వేదికపై జగన్ ప్రసంగానికి ముందు ‘జగన్‌వచ్చి మన బతుకులు ఎలా ఉన్నాయో చూస్తున్నాడు. చంద్రబాబు కనీసం పట్టించుకోలేదు.’అని తెలుగుదేశం పార్టీకి  చెందిన వి.సింహాచలం అనే మహిళ వేదికపై అనడం విశేషం. అదే వేదిక నుంచి ప్రభుత్వానికి జగన్ తుఫాను బాధితులను ఆదుకోవాలని పలు డిమాండ్లు చేశారు. వాటిని నెరవేర్చకపోతే ప్రజల తరపున పోరాటం చేస్తానన్నారు. ఇదే సమయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాధ్ మాట్లాడుతూ ప్రజలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడూ అండగా ఉంటారన్నారు.
     
    ఉద్దపాలెం, తాళ్లదిబ్బ, మాతయ్యపాలెం, దుప్పితూరు ప్రాంతాల్లో పర్యటించిన జగన్ ప్రతిఒక్కరి కష్టాలు అడిగితెలుసుకున్నారు. రాత్రి వేళ  అయినప్పటికీ ప్రజలతో పాటే అంధకారంలో గడుపుతూ వారికి ధైర్యమిచ్చారు. పర్యటన ముగించుకుని స్టీల్‌ప్లాంట్ మీదుగా విశాఖనగరానికి చేరుకున్నారు. పర్యటలో పార్టీ నాయకులు ధర్మాన ప్రసాదరావు..బొడ్డేడ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
     
    విశాఖలో నేడు పరామర్శ


    విశాఖ రూరల్: హుదూద్ తుపాను బాధితులను పరామర్శించడానికి విశాఖ వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నగరంలో పర్యటించనున్నారు. ఉదయం ఫోర్‌పాయింట్స్ హోటల్ నుంచి బయల్దేరి 9 గంటలకు ఫిషింగ్ హార్బర్‌ను సందర్శిస్తారు. అక్కడ మత్స్యకారులను పరామర్శించి ఏయూ వెళతారు. అక్కడి నుంచి జాలరిపేట, వాసవానిపాలెం వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లాడతారు. అనంతరం పెదగదిలి, ధర్మానగర్, తాటిచెట్లపాలెం, రామ్‌జీ ఎస్టేట్, 26వ వార్డులో ఉన్న దుర్గ ఆలయం, కొబ్బరితోట ప్రాంతాల్లో బాధితులకు పరామర్శిస్తారు. రాత్రి నగరంలోనే బస చేస్తారని జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, పార్టీ ప్రధాన కార్యదర్శి(ప్రోగ్రామ్స్) తలశిల రఘురామ్‌లు ఒక ప్రకటనలో తెలిపారు.
     

మరిన్ని వార్తలు