సెంట్రల్‌ జైళ్లు.. పరిమితికి మించి ఖైదీలు

24 Dec, 2019 07:56 IST|Sakshi

రాష్ట్రంలోని జైళ్లలో 123 శాతం ఖైదీలు ఉన్నారని తేల్చిన ఎన్‌సీఆర్‌బీ

తీవ్ర నేరాలు చేసిన వారిని కంట కనిపెట్టాలంటూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు

ప్రత్యేక నిఘా సెంటర్లు, అవసరమైనన్ని హై సెక్యూరిటీ జైళ్ల ఏర్పాటుకు సూచన 

సాక్షి, అమరావతి : సెంట్రల్‌ జైళ్లలో పరిమితికి మించి ఖైదీలను ఉంచాల్సి రావడం సమస్యగా పరిణమిస్తోందని జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ)–2017 నివేదిక తేల్చింది. దీనివల్ల జైళ్లలో మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వాలకు భారంగా మారుతోంది. దేశంలో అత్యధిక జైళ్లున్న రాష్ట్రాల్లో ఏపీ నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో తమిళనాడు, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ ఉన్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాల్లో అన్నిరకాల జైళ్లు కలిపి మొత్తం 105 ఉన్నాయి. వీటిలోని సౌకర్యాలు, బ్యారక్‌ల సామర్థ్యాన్ని బట్టి నిబంధనల ప్రకారమే ఖైదీలుండాలి.

విశాఖ, రాజమహేంద్రవరం, నెల్లూరు, కడప కేంద్ర కారాగారాలు 3,814 మంది ఖైదీల సామర్థ్యంతో ఉండగా.. వాటిలో ప్రస్తుతం 4,700 మంది ఖైదీలు ఉన్నారు. మొత్తంగా 123 శాతం ఖైదీలు ఉండటం గమనార్హం. 8 జిల్లా జైళ్లలో 92 శాతం మంది ఖైదీలుండగా, 91 సబ్‌ జైళ్లలో 72 శాతం ఉన్నారు. మొత్తం ఖైదీల్లో 101 శాతం పురుషులు, 58 శాతం మహిళలు ఉన్నారు. తీవ్రమైన నేరాలు చేసి సెంట్రల్‌ జైళ్లలో దోషులుగా, నిందితులుగా ఉన్న వారి సంఖ్య అధికంగా ఉండటంతో వారి పర్యవేక్షణ కష్టంగా మారుతోందని ఎన్‌సీఆర్‌బీ గుర్తించింది. జైళ్లల్లో నిఘా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ తాజాగా అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని జైళ్ల పరిస్థితిపై కూడా ఎన్‌సీఆర్‌బీ–2017 నివేదిక నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేసింది. 

కేంద్ర హోం శాఖ ఆదేశాలు ఇవీ

  • జైళ్లల్లో పటిష్ట బందోబస్తు పెంచడంతోపాటు ఖైదీల ప్రవర్తన, కదలికలపై నిరంతర నిఘా ఉంచాలి. 
  • నేరాల వారీగా ఖైదీలను విభజన చేసి ప్రత్యేక బ్యారక్‌లలో ఉంచాలి.  
  • తీవ్రమైన నేరాలు చేసి శిక్షలు పడిన వారంతా ఒకచోట కలిసే అవకాశం లేకుండా చూడాలి. అలా కలిస్తే వాళ్లు మరింత తీవ్రమైన నేరాలకు పథక రచన చేసే ప్రమాదం ఉందని గమనించాలి. 
  • ఇలాంటి వారిని ఉంచేందుకు హై సెక్యూరిటీ జైళ్లు ఏర్పాటు చేయాలి. 
  • జైలు నుంచి విడుదలవుతున్న వారిలో సత్ప్రవర్తనతో మెలుగుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. అందువల్ల నేరం చేసి జైలుకు వచ్చిన వారు మళ్లీ నేరాలవైపు మళ్లకుండా ఉండేలా ప్రత్యేక దృష్టి పెట్టాలి.  
  • జైలు నుంచి బయటకు వచ్చాక మంచి జీవితాన్ని గడిపేలా ఖైదీల్లో మార్పు కోసం జైలు గదుల నుంచే గట్టి ప్రయత్నాలు జరగాలి. అందుకు కౌన్సెలింగ్, తదితర మార్గాలను జైలు అధికారులు అనుసరించాలి. 
  • ఖైదీలు మానసిక వేదనతో కుంగిపోకుండా తగిన వృత్తులు, వ్యాపకాలను జైలులో నిర్వహించుకునేలా ఎప్పటికప్పుడు జైలు ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి.
     
మరిన్ని వార్తలు