‘మధుకన్డ్’కావరం

14 Jul, 2014 04:49 IST|Sakshi
‘మధుకన్డ్’కావరం

గెడ్డలకు అడ్డంగా గట్లు వేస్తున్నారు. నీటి మార్గాలను మళ్లిస్తున్నారు. చెరువులు నిండకుండా అడ్డుకుంటున్నారు. అన్నదాతల నోట్లో మట్టి కొడుతున్నారు. మధుకాన్ కాంట్రాక్టర్లు చెలరేగిపోతున్నారు. పోలవరం కాలువ తవ్వకాల కోసం గెడ్డల్ని కప్పెడుతున్నారు. రైతుల పాలిట సైంధవుల్లా తయారయ్యారు. రెండువేల ఎకరాల్లో ఖరీఫ్ సాగును ప్రశ్నార్థకం చేశారు. మధుకాన్ సంస్థ అధినేత టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుది కావడంతో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.
 
నక్కపల్లి: మండలంలో పోలవరం కాలువ నిర్మాణం చేపడుతున్న మధుకాన్ కాంట్రాక్టర్ల నిర్వాకం వల్ల జగన్నాథపురం, గుల్లిపాడు, గొడిచర్ల, ఉద్దండపురం, రమణయ్యపేట, డొంకాడ తదితర ప్రాంతాల్లోని చెరువుల్లోకి నీరు చేరక పంటలు పండని పరిస్థితి ఏర్పడింది. ఎగువ ప్రాంతాల నుంచి చెరువుల్లోకి వచ్చే నీటి మార్గాలకు కాంట్రాక్టర్లు అడ్డుకట్ట వేయడంతో నీరు దిగువ ప్రాంతాలకు రావడం లేదు. ఫలితంగా ఆయకట్టు భూముల్లో సాగు చేసే పరిస్థితి కనిపించడం లేదు. నాలుగేళ్లుగా ఇదే సమస్య ఎదుర్కొంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అ న్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
పోలవరం కాలువ తూర్పు, పడమర  దిశగా తవ్వుతున్నారు. నక్కపల్లి మండలంలో ఉత్తరం నుంచి దక్షిణ దిశగా పంట కాలువలు, కొండ గెడ్డలున్నా యి. కాలువ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు ఎ న్నో ఏళ్లుగా ఉన్న గెడ్డలకు అడ్డంగా మట్టి పోశా రు. వర్షాలు కురిసినప్పుడు ఎగువ ప్రాంతాల్లో పడిన నీరు దిగువకు పోయేలా మార్గాలను ఏర్పాటు చేయకపోవడంతో నీరంతా పోలవ రం కాలువలో చే రి నిలిచిపోతోంది. వందలాది ఎకరాలు ఆయకట్టు కలిగిన చెరువుల్లోకి చుక్క నీరు రావడం లేదు. జగన్నాథపురంలో పెద్ద చెరువు కింద 250 ఎకరాలు, నేరెళ్ల చెరువు కింద 120, ఉద్దండపురం పెద్దచెరువు కింద 350, గుల్లిపాడు ఈదుల చెరువు కింద 220, కొత్త చెరువు కింద 250, తిరపతమ్మ చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉంది. వర్షాలు కురి స్తేనే ఈ చెరువులు నిండి ఆయకట్టు పొలాలు సాగవుతుంటాయి.
 
నాలుగేళ్లుగా మధుకాన్ కాంట్రాక్టర్లు చెరువుల్లోకి నీరు రాకుండా గట్టు వేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివల్ల సగానికి పైగా ఆయకట్టు సాగుకు నోచుకోవడం లేదు. చెరవుల్లోకి నీరు వెళ్లే మార్గాలను యథావిధిగా పునరుద్ధరించాలని గుల్లిపాడు, గొడిచర్ల, ఉద్దండపురం రైతు లు ఇటీవల రెండు పర్యాయాలు మధుకాన్ క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన కూడా చేశారు. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువుల్లోకి నీరు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు.

గతంలో పడిన వర్షాలకు చెరువుల్లో నీరు చేరితే నారు పోసేవారమని, విత్తనాలున్నా నీరులేక వేయలేని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. రైతులు ఆందోళన చేస్తున్నా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వారంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మధుకాన్ కాంట్రాక్టర్లతో మాట్లాడి చెరువుల్లోకి నీరు చేరే మార్గాలను యధావిధిగా పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు