టీడీపీలో వర్గపోరు..!

14 Nov, 2013 02:59 IST|Sakshi

శ్రీకాకుళం టౌన్, న్యూస్‌లైన్:  జిల్లాలో మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు- కింజరాపు రామ్‌మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు వర్గాల మధ్య నలిగిపోతున్నాం...వచ్చే ఐదేళ్లలో టీడీపీకి భవిష్యత్ లేదు... పార్టీ కనుమరుగ వుతుంది... పార్టీని ఆ భగవంతుడే కాపాడాలి... అంటూ పార్టీ పాతపట్నం శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి. పార్టీలోని విభేదాలను వెళ్లగక్కాయి. వివరాల్లోకి వెళితే కిమిడి వర్గానికి చెందిన కొవగాపు సుధాకర్ పాతపట్నం నియోజకవర్గం పార్టీ ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. ఇది ఇష్టంలేని కింజరాపు వర్గం పార్టీ అధికార ప్రతినిధి కలిశెట్టి అప్పలనా యుడుకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి, పాతపట్నంలో హల్‌చల్ చేయాలని కొంత కాలంగా పావులు కదుపుతోంది.

 దీంతో ఇరువర్గాల మధ్య ముసలం మొదలైంది. కిమిడి, కింజరాపు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించేందుకు పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఐదుగురు సభ్యుల తో కూడిన సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ కమిటీలో ఒక సభ్యుడైన మాజీమంత్రి కిమిడి కళా వెంకట్రావు గైర్హాజరయ్యారు. కమిటీ సభ్యులు కొవగాపు, కలిశెట్టిలతో వేర్వేరుగా మాట్లాడారు. పార్టీ నాయకుల అభిప్రాయాలను సేకరించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. వాస్తవంగా జిల్లాలో పార్టీనాయకుల మధ్య సమన్వయం కొరవడితే జిల్లా ఇన్‌చార్జి బండారు సత్యనారాయణమూర్తి, బొండా ఉమామహేశ్వర రావులు చక్కదిద్దుతారు. దీనికి భిన్నంగా  కిమిడి లేకుండా, చంద్రబాబునాయుడుకి తెలియకుండా కింజరాపు వర్గం ఏక పక్షంగా సమావేశం ఏర్పాటుచే సింది.


 విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఫోన్‌లో కమిటీ సభ్యులకు చీవాట్లు పెట్టినట్టు సమాచారం.  దీంతో చివరకు ఇన్‌చార్జిగా ఉన్న కొవగాపుతో కలిసి పని చేయాలని కలిశెట్టిని సూచించినట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని కమిటీ సభ్యుడు చెప్పారు. అందుకే కలిశెట్టి సీరియస్‌గా భయటకు వెళ్లిపోయాడని తెలిపారు. దీనికి భిన్నంగా పాతపట్నం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తదనంతరం నిర్ణయం వెలువడ నుందని కింజరాపు వర్గం బయటకు చెబుతోంది.
 కాపుసామాజిక వర్గాన్ని కాదంటే...
 శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న పాతపట్నం నియోజకవర్గం విషయంలో కింజరాపు వర్గం కాలు దువ్వుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ తమని కాదని వేరే వర్గం వైపు మొగ్గు చూపితే టీడీపీకి కాపు సామాజిక వర్గం దూరంగా ఉండడం ఖాయమని, ముఖ్యంగా కింజరాపు వర్గాన్ని రానున్న ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరికలు ఇటీవల బహిరంగంగా రావడం గమనార్హం.

మరిన్ని వార్తలు