రామానాయుడికి అంతిమ వీడ్కోలు

8 Jan, 2014 03:13 IST|Sakshi

 గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్: విజయవాడ  ఎంపీ లగడపాటి రాజగోపాల్ తండ్రి లగడపాటి వెంకటరామానాయుడు (75) సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గుంటూరులో నివాసముంటున్న రామానాయుడు అస్వస్థతకు లోనవడంతో నెలరోజుల క్రితం హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్పించారు. ఊపిరితిత్తుల్లో నిమ్ముచేరి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. వెంకటరామానాయుడు భౌతిక కాయాన్ని సోమవారం మధ్యాహ్నం గుంటూరు మంగళగిరిరోడ్డులోని సీతారామనగర్ మూడోలైన్లోని స్వగృహంలో సందర్శనార్ధం ఉంచారు.

 రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, తెలుగుభాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, జిల్లా జడ్జి ఎస్.ఎం.రఫీ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్, ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కేశినేని నాని, నరేంద్ర చౌదరి, గజల్ శ్రీనివాస్ తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎంపీ లగడపాటిని, కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.

అంతిమ యాత్రలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్దసంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. పెద్దకుమారుడు ఎంపీ లగడపాటి అంత్యక్రియలు నిర్వహించారు. వెంకటరామానాయుడుకు భార్య రామలక్ష్మమ్మ, ఓ కుమార్తె, ముగ్గురు కుమారులున్నారు. కుమార్తె పద్మ భర్త భాస్కరరావు ల్యాంకో గ్రూప్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. లగడపాటి రాజగోపాల్ ఎంపీగా, లగడపాటి శ్రీధర్ సినీనిర్మాతగా కొనసాగుతున్నారు. మూడో కుమారుడు మధుసూదన్ ల్యాంకో మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు