టెండర్

8 Jan, 2014 03:09 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: ‘వడ్డించేవారు మనవారైతే కడబంతి అయితేనేం’ అన్నట్లుగా బడా పారిశ్రామికవేత్తలకు అనుగుణంగా అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. చిత్తశుద్ధితో టెండర్లు నిర్వహిస్తున్నామని చెప్పుకుంటూనే, పాలకపక్షాన్ని నమ్ముకున్న వారికి న్యాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు. మంగంపేటలో సీ, డీ గ్రేడ్ బెరైటీస్ టెండర్ల ప్రక్రియతో బెరైటీస్‌నే నమ్ముకొని జీవిస్తున్న 150 పల్వరైజింగ్ మిల్లులు, వాటిలో పనిచేస్తున్న ఐదువేల మందికి పైగా కార్మికుల ఉపాధి భవిష్యత్ ప్రశ్నార్థకం కానుంది.
 
 ఓపెన్ టెండర్ల ప్రక్రియ పొడవు చేతుల పందేరంగా మారిందని ఈ- ప్రొక్యూర్‌మెంట్ టెండర్లకు పాలకులు శ్రీకారం చుట్టారు. అందులో కూడా ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ)  చేతివాటం ప్రదర్శిస్తోంది. బడా బయ్యర్లకు అనుకూలంగా టెండర్ల నిర్వహణ ప్రక్రియను పొందుపర్చిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. అందుకు ఈనెల 10న నిర్వహించనున్న ఆన్‌లైన్ టెండర్లను పలువురు ప్రశ్నిస్తున్నారు. కోటీశ్వరులు మినహా మధ్యతరగతి పారిశ్రామికవేత్తలు పాల్గొనకుండా  ఆన్‌లైన్ టెండర్లను రూపొందించారని పలువురు ఆరోపిస్తున్నారు.
 
 ఎగుమతిదారులకే అనుకూలం...
 ప్రస్తుత ఆన్‌లైన్ టెండర్లు బెరైటీస్ ఎగుమతిదారులకే అనుకూలంగా ఉన్నాయని పలువురు పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. కనీసం 2లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని నిబంధనలు పొందుపర్చారు. టెండర్లలో పాల్గొన్న బయ్యర్లు ప్రతి టన్నుకు రూ.25 ఈఎండీ చెల్లించాల్సి ఉంది.
 
 అంటే కనీసం రూ.50 లక్షలు ఈఎండీ చెల్లించగల్గిగన వారు మాత్రమే టెండర్లలో పాల్గొనేందుకు అర్హులుగా నిర్ధారించారు. గత ఏడాది మార్చిలో ప్రవేశ పెట్టిన ఆన్‌లైన్ టెండర్లలో 25వేల మెట్రిక్ టన్నులు ఒక బిడ్‌గా పొందుపర్చారు. అంటే అప్పట్లో రూ.6.25లక్షలు మాత్రమే ఈఎండీ రేటు బయ్యర్‌కు పడేది. ఈ లెక్కన గత ఏడాది 12మంది బయ్యర్లు టెండర్లలో పాల్గొన్నారు. ఈమారు కనీసం బిడ్ 2లక్షల మెట్రిక్ టన్నులు పరిమాణం కారణంగా రూ.50లక్షలు ఈఎండి చెల్లించాల్సిన స్థితి ఏర్పడింది. ప్రస్తుతం టన్ను ధర రూ.1120 గా నిర్ణయించారు. అంటే కనీస బిడ్‌కు టెండరుకు వెళ్లదలిచిన వారు ఈఎండీతో కలిపి దాదాపు రూ.23కోట్లకు పెట్టుబడి పెట్టగల్గిన వారు మాత్రమే అర్హులుగా అధికారిక లెక్కల ద్వారా రూఢీ అవుతోంది. మంగంపేట బెరైటీస్ టెండర్లు కేవలం ఎగుమతిదారులు మినహా పల్వరైజింగ్ మిల్లుల యజమానులు పాల్గొనేందుకు వీలులేకుండా పొందుపర్చారనే పలువురి ఆరోపణలు నిజం చేస్తున్నాయి.
 
 ప్రశ్నార్థకంగా మారిన చిన్నతరహా పరిశ్రమలు...
 చిన్నతరహా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని పారిశ్రామిక ప్రగతి సాధించాలని ఓవైపు ప్రభుత్వ పెద్దలు ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తుంటారు.  కానీ ఏపీఎండీసీ చర్యలు అందుకు భిన్నంగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. మంగంపేట బెరైటీస్ ఆధారంగా నెలకొల్పిన సుమారు 150 పల్వరైజింగ్ మిల్లుల భవిష్యత్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారనుంది. ఈనెల 10న నిర్వహించనున్న ఆన్‌లైన్ టెండర్లలో పాల్గొన్నవారికి మాత్రమే సీ,డీ గ్రేడ్ బెరైటీస్ అప్పగించనున్నట్లు నిబంధనలు పెట్టారు. గత ఏడాది మార్చిలో నిర్వహించిన ఆన్‌లైన్ టెండర్లలో హెచ్చు పాటదారుడు రేటు చెల్లించిన ప్రతి మిల్లు యజమానికి సంవత్సరంలో 5వేల మెట్రిక్ టన్నుల బెరైటీస్ అప్పగించేలా చర్యలు తీసుకున్నారు.
 
 ఈమారు టెండర్లలో పాల్గొన్నవారు మినహా ఇతరులకు ఖనిజం కేటాయించే అవకాశాలు లేవని స్పష్టంగా నిబంధనల్లో పొందుపర్చారు. అంటే రూ.50లక్షలు ఈఎండీ చెల్లించగల్గిన స్థోమత ఉన్న మిల్లర్లకు మాత్రమే బెరైటీస్ దక్కేఅవకాశం ఉంది. లేదంటే టెండర్లు దక్కించుకున్న వారి నుంచి వారు నిర్ణయించే రేటుకు బెరైటీస్ కొనుగోలు చేయాల్సిన దుస్థితిని ఏపీఎండీసీ కల్పించిందని పలువురు పల్వరైజింగ్ మిల్లుల యజమానులు పేర్కొంటున్నారు. వారి నిర్ణయం కారణంగా మిల్లులు మూసుకోవాల్సిన దుస్థితి ఉత్పన్నం కానుందని, తద్వార 5వేల మందికి పైబడి కార్మికులకు అన్యాయం జరగనుందని పలువురు వాపోతున్నారు.
 
 ధర నిర్ణయించడంలో వ్యత్యాసం....
 ప్రస్తుతం మంగంపేట బెరైటీస్‌లో రూ.1926 టన్నుల బెరైటీస్ కొనుగోలు చేస్తున్నారు. అయితే ఆన్‌లైన్ టెండర్లలో టన్ను ధర రూ.1120లకే నిర్ణయించారు.  గత ఏడాది 25వేల మెట్రిక్ టన్నులకు ఒక బిడ్‌గా టెండర్లు నిర్వహించడంతోనే 12మంది మాత్రమే పాల్గొన్నారు. ఈమారు ఒక్కో బిడ్ 2లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ణయించడంతో టెండర్లలో పాల్గొనే వారి సంఖ్య బాగా తగ్గుతోంది. ఎగుమతిదారులు మినహా ఇతరులు పాల్గొనే అవకాశం లేదని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం 15లక్షల మెట్రిక్ టన్నులకు టెండర్లను ఆహ్వానించారు. కేవలం ఐదుగురు మాత్రమే ఆస్థాయిలో ఖనిజం తీసుకోగల్గిన వారు ఉన్నారు.  అంటే టెండర్లలో పాల్గొన్న వారందరికి ఖనిజం దక్కే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుత టన్ను ధర రూ.1926 కంటే బాగా తగ్గే అవకాశం ఉందని తద్వారా ఏపీఎండీసీకి గణనీయంగా ఆదాయం పడిపోయే స్థితి ఉందని పలువురు పేర్కొంటున్నారు.
 
 పాలకపక్షం కనుసన్నల్లోనే...
 సీ,డీ గ్రేడ్ బెరైటీస్ దక్కించుకునే వ్యూహాత్మక ఎత్తుగడల్లో భాగంగా పాలకపక్షం కనుసన్నల్లోనే టెండర్ల ప్రక్రియ ఉండేలా అధికారులు వ్యవహరించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. మంగంపేట పరిధిలో(పాతది) 30లక్షల మెట్రిక్ టన్నులు డంప్ ఒక చోట, కొత్తగా14లక్షల మెట్రిక్ టన్నుల డంప్ మరో చోట నిల్వచేశారు. అయితే టెండర్ల ప్రక్రియలో ఒకే డంప్ 15లక్షల మెట్రిక్ టన్నులు చూపారు. కొత్తగా నిల్వచేసిన డంప్‌లో వేస్టేజీ తక్కువ ఉన్నట్లు పలువురు పారిశ్రామికవేత్తలు పేర్కొంటున్నారు. అనుకున్న వారికి అనుకున్న విధంగా బెరైటీస్ అప్పగించేందుకు పాలకపక్షం వ్యూహాత్మకంగా టెండర్ల నిబంధనల నుంచి ఖనిజం నిల్వల వరకూ వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 ఎండీ ఆదేశాల మేరకే
 ఏపీఎండీసీ మేనే జింగ్ డెరైక్టర్ ఆదేశాల మేరకే టెండర్లలో కనీస బిడ్ 2లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ణయించాం. బిడ్ ఎక్కువ టన్నులు పెట్టడం వల్ల టెండర్లలో పాల్గొనే వారి సంఖ్య తగ్గవచ్చు. టెండర్లలో పాల్గొనని మిల్లరుకు ఖనిజం ఇవ్వమని చెప్పిన విషయం వాస్తవమే. మంగంపేట మిల్లర్ల అభ్యర్థనను బోర్డు దృష్టికి తీసుకెళ్లి ఖనిజం సరఫరాకు చర్యలు తీసుకుంటాం. టెండరుదారుడు కోట్ చేసిన ధరకే చిన్నతరహా మిల్లులకు కూడా సరఫరా చేసేందుకు బోర్డు అనుమతి తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్న ధర కంటే తక్కువ ధరను పొందుపర్చడం వెనుక పోటీ పెంచడమే అసలు ఉద్దేశం.
 

మరిన్ని వార్తలు