కాలనీయే కాలి బూడిదైంది..

9 Nov, 2014 00:28 IST|Sakshi
కాలనీయే కాలి బూడిదైంది..

 మగటపల్లి (మామిడికుదురు) : రెక్కలు పులిస్తే తప్ప డొక్కలు నిండని బడుగుజీవుల గూళ్లు భగ్గుమన్నాయి. చెమటోడ్చి సమకూర్చుకున్న సొమ్ము, సరుకులు, సామగ్రి బుగ్గి కాగా 45 కుటుంబాలు కట్టుబట్టలతో, కన్నీటితో మిగిలాయి. మండలంలోని మగటపల్లిలో శనివారం రాత్రి 7 గంటల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో శివాలయం కాలనీ బూడిద కుప్పగా మారింది. కాలనీవాసులు భోజనాలు చేసేందుకు సిద్ధమవుతున్న వేళ  ఒక్కసారిగా ఎగసిన మంటలు చూస్తుండగానే కాలనీని చుట్టుముట్టేశాయి. 45 నిమిషాల వ్యవధిలో 37 పూరిళ్లు బూడిదకుప్పలుగా మిగిలాయి. నాలుగు మేకలు సజీవ దహనమయ్యాయి. 100కు పైగా కొబ్బరి చెట్లు కాలిపోయాయి. ఆస్తినష్టం రూ.25 లక్షలు పైబడి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాదంలో నాలుగు గ్యాస్ సిలిండర్లు పేలి పోయాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగక పోవడంతో స్ధానికులు ఊపిరి పీల్చుకున్నారు. శివాలయం కాలనీలో ఇప్పుడు పరిస్థితి భయానకంగా ఉంది. గ్రామానికి దూరంగా ఉండే ఈ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు బాధితులంతా తలో దిక్కుకూ పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. కొందరు బాధితులు మంటల్ని చూసి స్పృహ తప్పి పడిపోయారు. పొయ్యి నుంచి లేచిన నిప్పురవ్వలు లేదా దీపం బుడ్డి వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
 
 కళ్ల ముందే గూళ్లు బూడిదయ్యాయి..
 మూడు అగ్నిమాపక శకటాలు మంటల్ని అదుపు చేశాయి. అయితే శకటాలు కాలనీలోకి వెళ్లేందుకు దారిలేక పోవడంతో 500 మీటర్ల దూరం నుంచే మంటల్ని అదుపు చేయడానికి శ్రమించాల్సివచ్చింది. కూలి పనులు ముగించుకుని ఇళ్లకు చేరి, భోజనానికి ఉపక్రమించే వేళ ఎగసిన కీలలు వారి జీవితాల్లో మరిచిపోలేని చేదును మిగిల్చాయి. ఎంతో కష్టపడి కట్టుకున్న ఇళ్లు కళ్ల ముందే కాలిపోయాయని కావడి ధనమ్మ, బత్తుల లక్ష్మమ్మ, యర్రంశెట్టి కృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి తాము ఎక్కడ తలదాచుకునేదంటూ బాధితులు రోదించారు. కాలనీని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు సందర్శించి, బాధితులను పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వపరంగా సహాయం అందించి ఆదుకుంటామన్నారు.
 

మరిన్ని వార్తలు