ప్రజల భద్రతే ప్రథమ లక్ష్యం

25 Jul, 2014 03:35 IST|Sakshi

 కర్నూలు: ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించడమే తన తొలి కర్తవ్యమని కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ ఆకె రవికృష్ణ స్పష్టం చేశారు. గురువారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా, ఎప్పుడైనా తనను కలవవచ్చని, ఏ క్షణంలోనైనా ఫోన్‌కు అందుబాటులో ఉంటానన్నారు. పోలీస్ అంటే ప్రజలకు మిత్రుడనే భావన కలిగించేలా వ్యవహరిస్తామని చెప్పారు. సిబ్బంది అలసత్వాన్ని సహించనన్నారు. పోలీస్ సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన బదిలీల్లో ఎస్పీ రఘురామిరెడ్డిని పశ్చిమగోదావరి జిల్లాకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో రవికృష్ణ నియమితులయ్యారు. 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన నల్గొండ జిల్లాలో శిక్షణ పొందారు. మొట్ట మొదట 2009లో మహబూబ్‌నగర్ జిల్లా పార్వతీపురం, తరువాత విశాఖ జిల్లా చింతపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో ఏఎస్పీ హోదాలో పని చేశారు. 2012లో ఎస్పీగా పదోన్నతి పొందారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగం నుంచి బదిలీపై కర్నూలుకు వచ్చారు.

రాజస్థాన్ పోలీస్ అకాడమీలో యాంటీ టైజమ్‌పై శిక్షణను ఒకరోజు ముందే ముగించుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హుటాహుటిన కర్నూలు చేరుకున్నారు. బుధవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో క్యాంప్ కార్యాలయానికి వెళ్లడంతో రఘురామిరెడ్డి ఆయనకు బాధ్యతలు అప్పగించారు. గురువారం ఉదయం జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
 
 సాక్షి : కర్నూలు జిల్లా ఎస్పీగా కొత్తగా వచ్చారు.. ఎలా ఫీలవుతున్నారు ?
 ఎస్పీ: జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా భావిస్తున్నాను. ఈ జిల్లాపై కొంత అవగాహన ఉంది. ఎస్పీ రఘురామిరెడ్డి సమర్థంగా పని చేశారని సిబ్బంది చెబుతున్నారు. ఆయన బాటలో నడిచి క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది సహకారంతో శాంతిభద్రతలను గాడిలో పెడతాను.

 సాక్షి : శాంతి భద్రతల పరిరక్షణలో మీ ప్రాధాన్య అంశాలేమిటి ?
 ఎస్పీ : ప్రజల భద్రత, మత సామరస్యం, రోడ్డు ప్రమాదాల నివారణ ప్రాధాన్యతాంశాలు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రధాన దృష్టి సారిస్తా. రోడ్డు ప్రమాదాల్లో యువత మృత్యువాత పడుతున్నారు. రహదారి భద్రతపై మరింత చైతన్యం రావాల్సి ఉంది. జాతీయ రహదారులపై దృష్టి సారించి రహదారి భద్రతకు ప్రణాళిక రూపొందిస్తాం. గతంలో నేను పని చేసిన చోట ప్రత్యేక  చర్యలు తీసుకొని ప్రమాదాల రేటు తగ్గించాను.

 సాక్షి : మీ గత అనుభవాలు జిల్లాలో రాణించడానికి ఎంత మేరకు  ఉపయోగపడుతాయని భావిస్తున్నారు ?
 ఎస్పీ : శిక్షణలో ఉన్నప్పుడు జిల్లాలో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో పర్యటించాను. జిల్లాలో జరిగే నేరాలపై అవగాహన ఉంది.  మహబూబ్‌నగర్ జిల్లా పార్వతీపురం, విశాఖ జిల్లా చింతపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లో ఏఎస్పీ హోదాలో పని చేశాను. ఈ అనుభవాలన్నీ సమర్థ విధి నిర్వహణకు ఉపయోగపడుతాయని భావిస్తున్నా.

 సాక్షి : శాంతి భద్రతల పరిరక్షణకు, సమర్థ పౌర సేవల అమలుకు మీ ప్రణాళిక ఏమిటి ?
 ఎస్పీ :  క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందితో మాట్లాడి జిల్లాపై అవగాహన పెంచుకుంటా. సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తా. ఫిర్యాదిదారులు పోలీస్ స్టేషన్‌కు వస్తే న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత క్షేత్ర స్థాయి అధికారులపై ఉంది. ఒక స్నేహితుడిగా పోలీసులు పని చేయాలి. నేరస్తులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తేలేదు.

మరిన్ని వార్తలు