చచ్చినా.. చావే!

11 Nov, 2019 10:35 IST|Sakshi
ఎస్సీ శ్మశానవాటికకు వెళ్లేందుకు వాగులో మోకాలి నీటిలో మృతదేహాన్ని తీసుకెళుతున్న ఎస్సీ కాలనీ వాసులు.. మోకాలి లోతు నీటిలో బురదలో వస్తున్న మృతుని బంధువులు

పేరేచర్ల(ఫిరంగిపురం): గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో కాలనీ వాసుల్లో ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లాలంటే కాలనీ వాసులకు చచ్చే పనవుతుంది. శ్మశానవాటికకు వెళ్లాలంటే మోకాళ్ల లోతు వాగులో దిగి వెళ్లాల్సిన పరిస్థితి. ఇక చనిపోయిన వారి వెంట వచ్చే బంధువులు, మహిళలు ఆ వాగులో దిగాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వం ఇక్కడ వంతెన నిర్మిస్తామని చెప్పి.. పట్టించుకోకపోవడంతో పరిస్ధితి దయనీయంగా మారింది.

చిన్న వర్షాలకే మోకాలి లోతు నీటిలో నడవాల్సి వస్తోందని, ఇక వరదలు వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోకాలి లోతు నీటితో పాటు బురదలో కూడా మృతదేహాన్ని తీసుకెళ్లలేని పరిస్ధితి ఉంది. ఇలాంటి పరిస్ధితి ఎవరికీ రాకూడదని, దయచేసి వంతెన నిర్మిస్తే ఎస్సీ కాలనీ వాసులకే కాకుండా పొలాలకు వెళ్లే వారికి కూడా అనువుగా ఉంటుందని వారు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు