చోరీల నివారణపై దృష్టి సారించాలి

21 May, 2015 05:45 IST|Sakshi
చోరీల నివారణపై దృష్టి సారించాలి

చోరీల నివారణపై దృష్టి సారించాలని డీజీపీ జె.వి.రాముడు అన్నారు. బుధవారం ఒంగోలులో జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించారు. అనంతరం ఐ-క్లిక్ కేంద్రాలు ప్రారంభించారు.
- రోడ్డు ప్రమాదాలనూ తగ్గించాలి
- జిల్లా పోలీసు అధికారులతో డీజీపీ రాముడు
ఒంగోలు క్రైం :
వేసవికాలం కావడంతో పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ చోరీలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, వాటిని పూర్తిగా నివారించడంపై దృష్టిసారించాలని రాష్ట్ర డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జె.వి.రాముడు జిల్లా పోలీసు అధికారులకు సూచించారు. రోడ్డు ప్రమాదాలను కూడా తగ్గించేందుకు కృషి చేయాలని చెప్పారు. అందుకు అవసరమైన ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం స్థానిక పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్, జిల్లా ఎస్పీ శ్రీకాంత్‌తో కలిసి పోలీసు అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ బి.రామానాయక్, ఎస్‌బీ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ కేశన వెంకటేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీలు కె.వి.రత్నం, బాలసుందరం, మార్కాపురం ఓఎస్‌డీ సమైజాన్‌రావు, చీరాల డీఎస్పీ జయరామరాజు, కందుకూరు, దర్శి డీఎస్పీలు, ఒంగోలు సబ్‌డివిజన్ పరిధిలోని సీఐలు పాల్గొన్నారు.

పోలీసుల సమస్యలపై డీజీపీకి వినతిపత్రం...
జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యలపై జిల్లా పోలీసు అధికారుల సంఘం ఆధ్వర్యంలో డీజీపీ జె.వి.రాముడుకు బుధవారం వినతిపత్రం అందించారు. పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్రా వెంకటరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగం రామనాథం తదితరులు పలు సమస్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో సిబ్బందికి నూతన క్వార్టర్స్ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సిబ్బందికి టీఏ ఇప్పించాలని కోరారు. హోంగార్డుల వేతనాన్ని రూ.9 వేల నుంచి రూ.12 వేలకు పెంచాలని కోరారు. ఇంకా పలు సమస్యలను వినతిపత్రంలో ప్రస్తావించారు. డీజీపీని కలిసిన వారిలో పోలీసు అధికారుల సంఘ జిల్లా నాయకులు సుబ్బారావు, నాయుడు, కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు