మాచన్‌పల్లిలో విదేశీ భక్తుల సందడి

5 Dec, 2013 00:53 IST|Sakshi

షాబాద్, న్యూస్‌లైన్: రష్యా దేశానికి చెందిన ఓ ఆధ్యాత్మిక ట్రస్టు సభ్యులు బుధవారం షాబాద్ మండలం మాచన్‌పల్లి గ్రామాన్ని సందర్శించారు. హిందూ సంప్రదాయాల పరిశీలన, ఆలయాల సందర్శన కోసం వీరు మనదేశానికి వచ్చారు. ఇందులో భాగంగా వీరు మాచన్‌పల్లిలోని శివాలయాన్ని సందర్శించారు. హరోం హర, ఓం నమశ్శివాయ అంటూ ఆలయంలో పూజలు చేశారు. రష్యా దేశస్తులు అలెగ్జాండర్, స్వామి కృష్ణానంద, మైఖేల్, ల్యాడ్‌మీర్ తదితరులకు మొదట గ్రామ సర్పంచ్ మహేందర్ రెడ్డి, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శివాలయానికి వెళ్లిన రష్యన్ బృందం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులతో కలిసి భజన చేశారు. హిందూ సంప్రదాయాలు, పూజా విధానాల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. మారుమూల గ్రామంలో చక్కటి దేవాలయం నిర్మించి, భక్తిశ్రద్ధలతో పూజలు కొనసాగిస్తుండటం అభినందనీయమని గ్రామస్తులను మెచ్చుకున్నారు. త్వరలో షాబాద్ మండల కేంద్రంలో కూడా దేవాలయాలను సందర్శిస్తామని, యోగా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తామని రష్యన్ బృందం తెలిపింది. కార్యక్రమంలో గ్రామస్తులు శేఖర్, నర్సింలు తదితరులు ఉన్నారు.
 
 హిందూ సంప్రదాయాలు బాగా నచ్చాయని, తాము భారతదేశవ్యాప్తంగా పర్యటించి ఇక్కడి ప్రజలకు యోగా నేర్పుతామని, ఎక్కడైనా ఆలయాల నిర్మాణానికి ముందుకు వస్తే తాము సహకరిస్తామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు