అదే ఆవేశం..

13 Jul, 2016 00:33 IST|Sakshi

టీడీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ రైతులు
భూదోపిడీ వ్యతిరేక సదస్సుకు పెద్ద సంఖ్యలో హాజరు
భూములివ్వం.. ప్రాణత్యాగాలకైనా సిద్ధమని వెల్లడి
తీరుమార్చుకోవాలి.. లేదంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరిక

 
 
మచిలీపట్నం పోర్టు, దాని అనుబంధ పరిశ్రమల పేరుతో భూదోపిడీకి తెగబడుతున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును రైతులు తీవ్రంగా నిరసించారు. మచిలీపట్నంలో మంగళవారం భూపరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సదస్సుకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. టీడీపీని గెలిపించడం ప్రజల దౌర్భాగ్యంగా మారిందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులకు మనశ్శాంతి లేదని వాపోయారు. సదస్సులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు ప్రభుత్వ భూదాహంపై మండిపడ్డారు. సర్కారు భూదందాలను అడ్డుకుంటామని, రైతులకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
 
 
మచిలీపట్నం (కోనేరు సెంటర్) : భూపరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మచిలీపట్నంలో జరిగిన ‘మడా ముసుగులో 1.05 లక్షల ఎకరాల భూదోపిడీ’కి వ్యతిరేకంగా జరిగిన సదస్సు మండల ప్రజల ఆగ్రహావేశాన్ని తెలియజేసింది. ఈ సదస్సులో పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు, వామపక్షాల నేతలు సీఎం చంద్రబాబు భూదాహాన్ని వివరిస్తూ ప్రసంగించారు. 4,200 ఎకరాల్లో పోర్టు నిర్మిస్తామని గతంలో చెప్పిన టీడీపీ ప్రభుత్వం 2015 ఆగస్టు 31న గుట్టుచప్పుడు కాకుండా 32వేల ఎకరాలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో బాధిత గ్రామాల ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయగా, ఇప్పుడు ఏకంగా 1.05 లక్షల ఎకరాలను భూదోపిడీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండటంపై బందరు మండల ప్రజలతో పాటు పెడన మండలంలోని కాకర్లమూడి గ్రామస్తులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మచిలీపట్నంలో జరిగిన సదస్సులో నేతల ప్రసంగాలు బాధిత ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తినినింపాయి. ఈ సందర్భంగా బాధితుల మనోవేదన, మండిపాటు, అసహనం, అసంతృప్తి వారి మాటల్లోనే..
 
 
పోరాటానికైనా సిద్ధమే..
చంద్రబాబు రైతుల భూములను గెద్దలా తన్నుకుపోవాలని చూస్తున్నాడు. భూదాహంతో భూములపై పడ్డాడు. లక్షల ఎకరాలు పోగుచేసుకుని రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నాడు. రాజధాని తరహాలో ఇక్కడ పప్పులు ఉడకనివ్వం.  - నరసింహారావు, మేకవానిపాలెం
 
తాతల ఆస్తులు తన్నుకుపోతారా?
 తాతల నాటి ఆస్తులను తన్నుకుపోవాలని చూస్తుంటే ఊరుకునేది లేదు. ఉన్న నేలను నమ్ముకుని బతికే రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. వారందరి ఉసురు పోసుకుని బాగుపడేది లేదు.  - వాలిశెట్టి సుధాకర్, గోపువానిపాలెం
 
తీసుకునేది ఎకరాలు.. ఇచ్చేది గజాలు
పోర్టు అభివృద్ధి, పరిశ్రమల పేరుతో ప్రభుత్వం రైతుల నుంచి లాక్కునేది ఎకరాలకు ఎకరాలు, ఇచ్చేది మాత్రం గజాలు అట. ఇంతటి ఉదార స్వభావం కలిగిన పార్టీ మరే రాష్ట్రంలో లేదనుకుంటా. - శ్రీనివాసరావు, మాజీ సర్పంచి, మేకవానిపాలెం
 
అభివృద్ధి పేరుతో సమాధులు

సీఎం అభివృద్ధి పేరుతో రైతులకు సమాధులు కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అభివృద్ధికి రైతులు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. అవసరమైన మేరకు భూములు తీసుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు. - బాబూరావు, నీటిసంఘం మాజీ అధ్యక్షుడు
 
 
రాష్ట్రానికి పట్టిన శాపం
రాష్ట్రంలో టీడీపీని గెలవనివ్వడం ప్రజల దౌర్భాగ్యం. చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశాడు. పోర్టు పేరుతో లక్షల ఎకరాలు దోచుకుందామని చూస్తున్నాడు. టీడీపీ నాయకులకు ధనదాహంతో పాటు భూదాహం పట్టింది.  - గాజుల నాగరాజు, చిలకలపూడి పీఏసీఎస్ అధ్యక్షుడు
 
 
 ఆ వైఖరి మారాలి
సీఎంకు భూదాహం పట్టింది. లక్షల ఎకరాలు మింగేయాలని చూస్తున్నాడు. అదే కనుక జరిగితే ఆత్మహత్యలు లేదంటే, హత్యలు చూడాల్సి వస్తుంది. ప్రశాంతంగా నడిచిపోయే ప్రాంతంలో అలజడి సృష్టిస్తున్నారు. సీఎం వైఖరిని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలి.
 - పిప్పళ్ల నాగబాబు, ఎంపీటీసీ పోతేపల్లి
 
 
 

మరిన్ని వార్తలు