నాగలి కదిలింది..

28 Jun, 2014 00:19 IST|Sakshi

వేద పండితుల జపాలే ఫలించాయో.. అన్నదాతల ఆక్రందనలే వినిపించాయో మరి.. ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. వానమ్మను పంపి నెర్రెలు బారిన నేల తల్లికి ఊరట కలిగించాడు. ఖరీఫ్ పంటలకు ప్రాణం పోసేందుకు ఊతమిచ్చాడు. ఆలస్యంగానైనా తొలకరి పలకరించటంతో తేరుకున్న రైతన్నలు సాగు పనులకు శ్రీకారం చుట్టారు.
 
 రేపల్ల్లె/కొరిటెపాడు(గుంటూరు): జిల్లా వ్యాప్తంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి వర్షపు జల్లులు పడటంతో అన్నదాతల్లో ఆశలు చిగురించారుు. కొంతమేరైనా పంట పొలాలు తడవటంతో ఖరీఫ్ పనులకు సిద్ధమయ్యూరు. ఇప్పటికే విత్తనాలను సిద్ధం చేసుకున్నవారు వ్యవసాయ పరికరాలకు పని చెప్పేందుకు సన్నాహాలు ప్రారంభించారు. జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం 8.64 సెంటీ మీటర్లు కాగా గురువారం వరకు ఒక్క చినుకూ రాలకపోవటంతో అటు రైతులు, ఇటు అధికారులు తీవ్రంగా ఆందోళన చెందారు.
 
 ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే పరిస్థితి నెలకొనటం అందరికీ కలవరం కలిగించింది. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 13.85 లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 25,778 ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు వేశారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు పడటం, ఇవి కొనసాగే అవకాశాలుండటంతో పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తున్నారు. శుక్రవారం నూజెండ్ల మండలంలో అత్యధికంగా 2.40 సెంటీ మీటర్ల వర్షం పడగా జిల్లాలో సగటున 0.41 సెం.మీ వర్షపాతం నమోదైంది.
 
 వర్షపాతం వివరాలు..
 జిల్లాలో శుక్రవారం నూజెండ్ల మండలంలో అత్యధికంగా 2.40 సెంటీమీటర్లు, అత్యల్పంగా మాచర్ల మండలంలో 0.10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సగటున 0.41 సెం.మీ వర్షం పడింది. అమృతలూరు మండలంలో 2.02 సెం.మీ, బాపట్లలో 2, తుళ్లూరులో 1.64, అమరావతిలో 1.38, మంగళగిరిలో 1.34, వెల్దుర్తిలో 1.32, పెదనందిపాడులో 1.26, తాడికొండలో 1.22, భట్టిప్రోలులో 1.10, వట్టిచెరుకూరులో 0.92, తాడేపల్లిలో 0.86, పెదకాకానిలో 0.86, ఫిరంగిపురం లో 0.66, సత్తెనపల్లిలో 0.64, గుంటూరు లో 0.60, అచ్చంపేటలో 0.56, ప్రత్తిపాడులో 0.52, మేడికొండూరులో 0.44, క్రోసూరులో 0.36, పెదకూరపాడులో 0.22, యడ్లపాడులో 0.20, నాదెండ్ల లో 0.16, నరసరావుపేటలో 0.14, ముప్పాళ్ల మండలంలో 0.12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
 

>
మరిన్ని వార్తలు