ఉపాధిలో భారీ అక్రమాలు

1 Feb, 2020 13:01 IST|Sakshi
ప్రజావేదికలో సామాజిక తనిఖీ వివరాలు వెల్లడిస్తున్న అధికారులు

రూ. 9 లక్షలకుపైగా అక్రమాలను గుర్తింపు  

ఎక్కువ శాతం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనుల్లోనే..

రూ.38.88 లక్షల పీఆర్‌ పనుల రికార్డులు మాయం

సంతకవిటి ప్రజావేదికలో బహిర్గతం  

రాజాం/సంతకవిటి: ప్రజావేదిక సాక్షిగా ఉపాధి హామీ పనుల్లో రూ. 9 లక్షలకుపైగా అక్రమాలు బహిర్గతమయ్యాయి. దీంతో పాటు రూ.38.88 లక్షల పీఆర్‌ పనులకు సంబంధించి రికార్డులను మాయం చేశారు. ఇవన్నీ గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది. సంతకవిటి మండలంలో 2018 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి వరకూ చేపట్టిన ఉపాధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల నిధుల ఖర్చులుపై జనవరి 18 నుంచి జనవరి 30 వరకూ సామాజిక తనిఖీలు బృందం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసింది. వీటిపై శుక్రవారం సంతకవిటిలోని స్త్రీ నిధి భవనం వద్ద ప్రజావేదిక నిర్వహించి అక్రమాలు వెల్లడించింది. డ్వామా పీడీ హెచ్‌ కూర్మారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక తనిఖీల బృందం ఎస్‌ఆర్పీ ఏసేఫ్, డీఆర్పీలు పంచాయతీల వారీగా, శాఖల వారీగా వివరాలను వెల్లడించారు. 

రూ. 9 లక్షలకుపైగా...
2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 2068 పనులపై ఆడిట్‌ నిర్వహించారు. ఇందులో రూ. 9.77 కోట్లు వేతనదారులు పనులపైన, రూ. 4.94 కోట్లు మెటీరియల్‌ పనులపై తనిఖీలు చేపట్టారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులకు సంబంధించి రూ 6,68,140 అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. పీఆర్‌ పనులకు సంబంధించి రూ. 18,88లు, సెర్ప్‌కు సంబంధించి రూ. 1,84,778, హౌసింగ్‌కు సంబంధించి రూ. 700, పశుసంవర్ధక శాఖకు సంబంధించి రూ. 20,278, ఆర్‌వీఎంకు సంబంధించి రూ. 4526, అపరాధ రుసుముకు సంబంధించి రూ. 4526ల అక్రమాలను గుర్తించి ఆధారాలతో సహా వివరించారు. ఎక్కువుగా గోళ్లవలస, సంతకవిటి, గోవిందపురం, పుల్లిట తదితర ప్రాంతాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ధ్రువీకరించారు. ఉపాధిలో భారీగా రూ.6.68 లక్షల అక్రమాలు జరగగా, సెర్ప్‌లో భాగంగా వెలుగులో రూ. 1.84 లక్షల అక్రమాలు జరగడం పలు విమర్శలకు తావిస్తోంది. 

పీఆర్‌ రికార్డులు గల్లంతు..  
మండలంలో 44 పీఆర్‌ పనులకు సంబంధించిన రికార్డులు మాయమయ్యాయి. సామాజిక తనిఖీల బృందం పది రోజులుగా ఈ రికార్డులను సంబంధిత అధికారులను అడిగినా ఇవ్వలేదు. ఇవి కార్యాలయాల్లో కూడా లేకపోవడంతో ఈ పనులకు సంబంధించిన రూ. 38.88 లక్షలపై సామాజిక తనిఖీలు నిర్వహించలేదు. దీంతో వీటి నిధులు దుర్వినియోగమైనట్లుగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక తనిఖీల ఎస్‌టీఎం గౌరీశంకర్, ఐఎంపీ రమణమూర్తి, విజిలెన్స్‌ అధికారి ఆర్‌ వెంకటరామన్, రాజాం ఏపీడీ విద్యాసాగర్, సంతకవిటి ప్రత్యేకాధికారి ప్రభామాణిక్యాలరావు, ఎంపీడీవో వేణుగోపాలనాయుడు, ఏపీవో త్రినాథరావు, ఏపీఎం దదికుమార్, సోషల్‌ ఆడిట్‌ డీఆర్పీలు, వీఎస్‌ఏలు, పలు గ్రామాల ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు