అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం

22 Nov, 2017 13:09 IST|Sakshi

మండలిలో కామినేని, ముద్దుకృష్ణమనాయుడి మధ్య వాగ్వివాదం

సాక్షి, అమరావతి :  ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మధ్య మాటల యుద్దం జరిగింది. చిత్తూరు జిల్లాలో డెంగీ, అంటువ్యాధులతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నా... జిల్లా వైద్య శాఖ సరిగా స్పందించడం లేదని గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. సరైన వైద్యం అందకపోవడంతో జిల్లా ప్రజలు... చెన్నై, బెంగళూరుకు వెళుతున్నారని అన్నారు. తొమ్మిదేళ్లుగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణిని మార్చలేదని అన్నారు.

రెండు, మూడేళ్లకే ప్రభుత్వ ఉపాధ్యాయులను బదిలీలు చేస్తున్నారని, అలాంటిది ఆ అధికారిణిని తొమ్మిదేళ్లుగా అక్కడే ఎలా విధుల్లో ఉంటారని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్త పరీక్షల నిర్వహణలో అవినీతిపై మంత్రి కామినేనిని...ముద్దుకృష్ణమనాయుడు నిలదీశారు. టెండర్‌లను తక్కువ కోట్‌ చేసినవారిని వదిలేసి, ఎక్కువ కోట్‌ చేసినవారికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై సభా సంఘం వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అయితే సభలో సభ్యులు అడగిన ప్రశ్నకు, మీరు అడుగుతున్న ప్రశ్నకు సంబంధం ఏంటని గాలి ముద్దుకృష్ణమనాయుడిపై మంత్రి కామినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశాఖపై నిన్న (మంగళవారం) సభలో రెండు గంటలు చర్చించినప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. అంతేకాకుండా మెడల్‌ టెండర్లు విషయంలో అంతా సవ్యంగా, పారదర్శకంగానే చేశామని అన్నారు.  అయితే సభ్యులు అడిగిన ప్రశ్నలకు తాను తప్పకుండా సమాధానం చెబుతానని అన్నారు.

మరిన్ని వార్తలు