గ్యాస్ డీలర్ల సమ్మెబాట

24 Feb, 2014 01:47 IST|Sakshi
గ్యాస్ డీలర్ల సమ్మెబాట
  • రేపటి నుంచి నిరవధికంగా...
  •  చమురు కంపెనీల తీరుపై కన్నెర్ర కొత్త ఏజెన్సీల ఏర్పాటు
  •  యత్నాలపై నిరసన
  •  జిల్లాలో 74 ఏజెన్సీల డీలర్లు సమ్మెలోకి
  •  విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఏజెన్సీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో జిల్లాలో 20 కొత్త  గ్యాస్ ఏజెన్సీలు రానున్నాయి. వాటిలో విజయవాడ నగరంలో 5 కొత్త ఏజెన్సీలు ఏర్పాటు అవుతాయి. ఇవిగాక రాజీవ్ యోజన పథకం కింద కూడా గ్రామాల్లో మరికొన్ని సబ్ ఏజెన్సీలను నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వటానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త ఏజెన్సీలు వచ్చేస్తే ఇప్పుడున్న గ్యాస్ ఏజెన్సీలలోని కనెక్షన్లు కొన్నింటిని వాటికి బదిలీ చేస్తారు. దీంతో ఎంతో కాలం నుంచి వ్యాపారం చేస్తున్న గ్యాస్ డీలర్లు తాము నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    ఇటీవల కాలంలో చేయని తప్పులకు తమను బాధ్యులను చేస్తున్నారని వారు వాపోతున్నారు. వినియోగదారులను ఇక్కట్లకు గురి చేసే నిబంధనలు జారీ చేస్తున్న ప్రభుత్వం, స్పష్టమైన ఆదేశాలు లేకుండా దొంగనాటకం ఆడుతోందని విమర్శిస్తున్నారు.  చమురు కంపెనీలు చేసే తప్పులకు తమను బాధ్యులను చేస్తున్నారని డీలర్లు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 25 నుంచి దేశవ్యాప్తంగా జరపతలపెట్టిన నిరవధిక సమ్మెను జయప్రదం చేయటానికి గ్యాస్ డీలర్లు సమాయత్తమవుతున్నారు. సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. జిల్లాలో 74 గ్యాస్ ఏజెన్సీల డీలర్లు నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నారు. దాంతో లక్షలాది మంది వినియోగదారుల్లో కూడా గ్యాస్ సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది.
     
    ఆధార్ లింకుతో అవస్థలు...
     
    ఆధార్ లింకుతో గ్యాస్ వినియోగదారులతో పాటు డీలర్లు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ అనుసంధానం విషయంలో నిబంధనలు సరిగా లేకపోవటంతో డీలర్లు, వినియోగదారులు నానా అగచాట్లు పడుతున్నారు. బ్యాంకులలో, గ్యాస్ ఏజెన్సీలలో ఆధార్ లింక్ అయినా సబ్సిడీ వినియోగదారుల ఖాతాలలో జమకావటం లేదు. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎన్ ఎఫ్‌సీఐ (నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)లో ఆధార్ లింక్ అయితేనే గ్యాస్ వినియోగదారుల ఖాతాలలో సబ్సిడీ డబ్బు జమవుతుంది.
     
    కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎన్‌ఎఫ్‌సీఐలో ఆధార్ లింక్ కాకపోవటంతో అక్కడ నుంచి డబ్బు జమకావటం లేదని గ్యాస్ డీలర్లు చెబుతున్నారు. 48 గంటలలోపు గ్యాస్ సరఫరా కాకపోతే చమురు కంపెనీలు గ్యాస్ ఏజెన్సీలకు లక్షలాది రూపాయలు జరిమానాలు విధిస్తున్నాయని, చమురు కంపెనీలు సక్రమంగా గ్యాస్‌సరఫరా చేయకుండా వాటినుంచి ఆలస్యంగా గ్యాస్ వచ్చినా ఏజెన్సీలనే బాధ్యులను చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు.

    చమురు కంపెనీల నుంచి ఏజెన్సీలకు సరిగా స్టాక్ రాకపోవటం వల్ల సరఫరాలో ఆలస్యం అయినా ఏజెన్సీలను బాధ్యులుగా చేస్తూ జరిమానాలు విధిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని ఆల్‌ఇండియా ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఇండియా ఆధ్వర్యంలో అన్ని కంపెనీల గ్యాస్ ఏజెన్సీలు నివరధిక సమ్మెకు సిద్ధమవుతున్నాయి.
     

మరిన్ని వార్తలు