మార్కులు తక్కువొచ్చాయని...

18 May, 2015 20:04 IST|Sakshi

హైదరాబాద్: పదవతరగతి పరీక్షల పలితాలు ఓ ఇంట్లో విషాదాన్ని నింపాయి. తనకంటే స్నేహితులకు ఎక్కువ మార్కులు రావడంతో మనస్థాపం చెందిన విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ మీర్‌పేటలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. సూర్యపేటకు చెందిన జంగయ్య కుటుంబం మీర్‌పేటలోని ఓల్డ్ విలేజ్‌లో అద్దెకు ఉంటూ కూలీపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. జంగయ్య కూతురు త్రివేణి(15) జిల్లెలగూడలోని చల్లలింగారెడ్డి జిల్లా పరిషత్ పాఠశాలలో పదవతరగతి చదివింది.

కాగా ఆదివారం వెలువడిన పరీక్ష ఫలితాలలో తోటి స్నేహితులకు 9.5, 9.3 జీపీఏ రాగా త్రివేణికి 7.3 జీపీఏ వచ్చింది. స్నేహితుల కంటే తనే బాగా చదివినా.. తనకే తక్కువ మార్కులు రావడంతో మనస్థాపం చెందిన త్రివేణి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తర్వాత గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మీర్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని చెప్పడంతో మృతదేహాన్ని సొంతూరు సూర్యపేటకు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. విషయం తెలిసిన స్నేహితులు త్రివేణి ఇంటికి చేరుకుని కన్నీరు మున్నీరయినట్లు స్థానికులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు