‘నన్ను రక్షించి’.. గుండెల్లో ‘గోదారి’ సుడి

20 Sep, 2019 10:15 IST|Sakshi
భర్త, కూతురితో మధులత

కళ్ల ముందే కకావికలం

తేరుకునేలోపే అంతా అయిపోయింది

‘సాక్షి’తో మధులత

సాక్షి,తిరుపతి: అందమైన పొదరిల్లులాంటి కుటుంబం. భర్త, పాపే ఆమె లోకం.  ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. గోదావరిలో బోటు రూపంలో మృత్యువు వెంటాడింది. సుడిగుండాలు ఒక్కసారిగా వారిని లాగేసుకుని ఎన్నో కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చింది.  బోటు మునక ప్రమాదంలో భర్త సుబ్రహ్మణ్యం, కూతురు హాసిని తిరిగి రాని లోకాలకు చేరుకోవడం తిరుపతి వాసి మధులతకు అంతులేని దుఃఖాన్ని మిగిల్చింది. పీడకలలా వెంటాడుతున్న ఆ విషాదాన్ని ఆమె ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆమె మాటల్లోనే...

సెలవులు కలిసి రావడంతో...
మా మామగారు చనిపోయి 9నెలలైంది. ఆయన అస్థికలను గోదావరిలో కలిపేందుకు రాజమండ్రికి  శనివారం మేము వెళ్లాం. అక్కడ ఓ హోటల్‌లో బస చేశాం.  ఆదివారం ఉదయం 9గంటల వరకు హోటల్‌ గదిలోనే ఉన్నాం. అప్పటికే బోటు వారు పదేపదే ఫోన్లు చేశారు. బోటు బయలుదేరుతోంది త్వరగా రమ్మంటూ.. 

అస్థికలు కలిపి...
బోటు బయల్దేరి ఉంటుంది. ఇక ఇప్పుడు వెళ్లి నా బోటును అందుకోలేమని అనుకున్నాం. కోటిలింగాలరేవు వద్ద అస్థికలను కలిపి గల్లిపోచమ్మ ఆలయాన్ని దర్శించుకుని వద్దామని నిర్ణయించుకున్నాం. 11.30గంటల ప్రాంతంలో అస్థికలను కలిపేశాం. అయితే అప్పటికి బోటు(మృత్యువు) మా కోసం ఎదురుచూస్తోంది. పోలీసులు ప్రయాణికుల వివరాలను సేకరించుకున్నాక 11.40 గంటల ప్రాంతంలో బోటులో బయల్దేరాం. 

సరదాగా గడిపాం...
బోటులో అందరూ సంతోషంగా ఉన్నారు. డ్యాన్సులు వేసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. మా పాప హాసిని వాళ్ల నాన్నను కూడా డ్యాన్స్‌ చేయాలని పట్టుబట్టింది. మా ఆయన ఎప్పుడూ రిజర్వ్‌డుగా ఉంటారు. అలాంటి ఆయన పాప కోసం డ్యాన్స్‌ చేస్తూ సరదాగా గడిపారు.

 

మరో పది నిమిషాల్లో...
మరో పది నిమిషాల్లో ఒడ్డున చేరి భోజనం చేయాల్సి ఉంది. ఇంతలో ఒకతను(గైడ్‌) గోదావరిలోనే ప్ర మాదకరమైన ప్రాంతం ఇది. ఇక్కడ దాదాపు 300అడుగులకు పైగా లోతు ఉంటుంది. సుడిగుండాలు ఉంటాయి. ఈ ప్రాంతంలో బోటు కాస్త కుదుపులకు లోనవుతుంది. అయితే ఎవరూ కంగారు పడకండి అని చెప్పిన నిమిషంలోనే బోటు ఒక వైపు ఒరిగిపోయింది. అంతవరకు సంతోషంగా గడిపిన మాకు ఏం జరిగిందో తెలిసే లోపే ప్రమాదం జరిగిపోయింది. 

నన్ను రక్షించి...
బోటు ఒక వైపు ఒరిగిపోవడంతో అందరూ నీళ్లలో పడిపోయారు. మా ఆయన నన్ను అమాంతంగా పైకి లాగారు. పాపను రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే భయంకరమైన అలలు, సుడిగుండం వల్ల వారు గల్లంతయ్యారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. కళ్ల ముందే కకావికలం అయ్యింది. తేరుకునేలోపు అంతా అయిపోయింది. 

ప్రాణాలను పణంగా పెట్టారు
బోటు మునిగిపోతున్న ప్రాంతానికి సమీపంలో ఉన్న కచ్చలూరు గ్రామస్తులు గమనించి వెంటనే∙స్పందించారు. చిన్నచిన్న పడవలలో వచ్చి చేరుకున్నారు. నీటిలో మునిగిపోతున్న వారిని ప్రాణాలను పణంగా పెట్టి రక్షించారు.  వారి సాహసంతోనే 16మంది ప్రాణాలతో బయటపడ్డాం. 

భద్రతా ప్రమాణాలు పాటించలేదు
ఇదివరకే గోదావరిలో ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. చాలా మంది మరణించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బోటు నడిపేవారు భద్రతా ప్రమాణాలు పాటించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. 

స్కూల్‌ ట్రిప్‌కు వెళ్తాను.. ‘సుబ్బూ’!
హాసిని వాళ్ల నాన్నను నాన్న, డాడీ అని సంభోదించదు. సుబ్బూ..! అని పిలుస్తుంది. వారిద్దదూ అంత స్నేహంగా ఉండేవారు.  అలా పిలవద్దని మందలించినా ఆయన మాత్రం తనని అలాగే పిలవనీ బాగానే ఉందంటూ నవ్వేవారు. ఈ నెల 14న శనివారం స్కూల్లో ట్రిప్‌ ఏర్పాటుచేశారు. స్నేహితులతో కలిసి వెళ్తాను సుబ్బూ అని చెప్పింది. అయితే ఆయన మాత్రం వద్దని చెప్పారు. తాతయ్య అస్థికలు కలపడం ముఖ్యమా.. స్కూల్‌ ట్రిప్‌ ముఖ్యమా? అని అడిగారు.

ఎక్కడ తండ్రి నొచ్చుకుంటాడోనని సరేనంది. ఒక వేళ స్కూల్‌ ట్రిప్‌కు వెళ్లమని  ఉన్నా... లేక మా ప్రయాణాన్ని వాయిదా వేసుకుని ఉన్నా.. మా అందమైన జీవితం మరోలా ఉండేది అని చెబుతుంటే.. దుఃఖం ఒక్కసారిగా తన్నుకొచ్చింది. మళ్లీ ఆమె నోట మాట పెగల్లేదు..ధారాపాతంగా కళ్లు వర్షించసాగాయి.. వేదన గోదావరి సుడిగుండమై గుండెలో జ్ఞాపకాలు సుడులు తిరుగుతుంటే..!! 
చదవండి : ఆపరేషన్‌ ‘రాయల్‌ వశిష్ట పున్నమి’

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా