భయపెడుతున్న ఈ–కోలి భూతం

25 Jun, 2019 03:49 IST|Sakshi

అత్యంత ప్రమాదకర స్థాయిలో గోదావరి నీరు 

భూగర్భ జలాలకూ విస్తరణ 

భూమిలో కలుస్తున్న మురుగునీరు..రసాయనాలు

పట్టించుకోకుంటే పెనుముప్పు

అమలాపురం: ఇచ్చరిచియా కోలి (ఈ–కోలి). అత్యంత ప్రమాదకరమైన ఈ బ్యాక్టీరియా ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వాసులను వణికిస్తోంది. ఇప్పటి వరకు గోదావరి నది..పంట కాలువల్లో మాత్రమే ఉన్న ఈ–కోలి బ్యాక్టీరియా ఉనికి ఇప్పుడు భూగర్భ జలాల్లోనూ కనిపిస్తోంది. ప్రజలకు రోగ కారకమైన దీని ఉధృతి వర్షాకాలంలో మరింత పెరిగే అవకాశముంది.  రాజమహేంద్రవరం నగరంలోని మురుగునీరు, స్థానికంగా పేపరు మిల్లుల నుంచి వచ్చే వర్థ్య జలాలు, గోదావరి ఎగువ ప్రాంతాల్లో పలు కంపెనీల రసాయనాలు, పట్టణాలకు చెందిన మురుగునీరు కలవడం వల్ల దీని సాంద్రత రోజురోజుకు పెరుగుతోంది.  గోదావరి పుష్కరాల సమయంలో నదిలో ఏకంగా ఐదు వేల కాలనీస్‌ (యూనిట్లు) వరకు ఈ–కోలి రికార్డు స్థాయిలో నమోదయిందంటే దీని తీవ్రత ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నదుల నుంచి వచ్చే నీటిలోనూ, భూగర్భ జలాల్లో ఇది ఎక్కువగా ఉందని కోనసీమ కాలుష్యంపై పరిశోధన చేస్తున్న ఎస్‌కేబీఆర్‌ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్‌ పెచ్చెట్టి కృష్ణకిశోర్‌ అధ్యయన బృందం నిర్ధారించింది.

ఈ నీటినే జిల్లాలో సుమారు 60 శాతం మంది ప్రజలు తాగునీరుగా వినియోగిస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతోపాటు మండపేట, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, అమలాపురం మున్సిపాలిటీలతోపాటు వందల గ్రామాలకు తాగునీటి అవసరాలను తీరుస్తోంది. ఇటీవల కాలంలో ఆక్వా సాగు విచ్చలవిడిగా పెరగడంతో వృథా అవుతున్న మేతలు, రసాయనాల వల్ల చెరువుల చుట్టుపక్కల సుమారు 2 కి.మీ. మేర నీరు ఉప్పుబారిన పడడంతో పాటు కాలుష్యం కారణంగా భూగర్భ జలాల్లో ఈ–కోలి వ్యాప్తి చెందుతోంది. గడచిన మూడేళ్లుగా ఈశాన్య రుతుపవనాలు మొఖం చాటేయడం కూడా ఈ–కోలి బ్యాక్టీరియా పెరుగుదలకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.  

బ్యాక్టీరియాలోనే ‘ఈ–కోలి’ అత్యంత ప్రమాదకరం
- బ్యాక్టీరియాలో అత్యంత ప్రమాదకరమైంది ఇచ్చరిచియా కోలి (ఈ–కోలి). దీనివల్ల ఆయాసం, వాంతులు, కడుపునొప్పి, అతిసార, తీవ్ర జ్వరానికి దారితీస్తోంది. 
వర్షాకాలం సీజన్‌లో పలువురు జ్వరాల బారిన పడడానికి ఇదే కారణం. ఇది వృద్ధి చెందకుండా చర్యలు తీసుకునే అధికార వ్యవస్థ లేదు. 
​​​​​​​- కొత్త నీరు వస్తున్న సమయంలో.. అంటే వర్షాకాలంలో భూగర్భ జలాల్లో సైతం ఉభయ గోదావరి జిల్లాల్లో ఇది వ్యాప్తి చెందుతుంది. 

ప్రమాదస్థాయిని దాటుతోంది..
గోదావరి డెల్టా ప్రాంతంలో ఈ–కోలి స్థాయి 625 నుంచి 650 కాలనీస్‌(యానిట్లు) దాటి ఉంది. మెట్టలో సైతం ఇంచుమించు ఇదే పరిస్థితి. నీటిలో 500 కాలనీస్‌ దాటితే ప్రమాదం. సముద్రంలో పేరుకుపోయే జంతు ప్లవకాలు, వృక్ష ప్లవకాల మీద దట్టమైన ఇసుక పేరుకుపోతోంది. ఓఎన్జీసీ తవ్వకాలతో అవి నీటిపైకి వస్తాయి. జిల్లాలో నదీ ముఖ ద్వారాలైన బలుసుతిప్ప, అంతర్వేది. ఓడలరేవు ద్వారా ఇది నదిలోకి వచ్చి, అక్కడ నుంచి భూగర్భంలోకి చేరడం, ఆక్వా చెరువుల ద్వారా విస్తరిస్తోంది. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.  

మరిన్ని వార్తలు