బంగారు మోచిప్పతో కీళ్ల మార్పిడి ఆపరేషన్

28 Feb, 2016 07:06 IST|Sakshi
బంగారు మోచిప్పతో కీళ్ల మార్పిడి ఆపరేషన్

గుంటూరు : రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గుంటూరు సాయిభాస్కర్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో విటమిన్ ఈప్లస్ పాలీతో తయారుచేసిన బంగారు మోచిప్ప(త్రీడీ గోల్డ్ నీ) ఇంప్లాంట్‌తో కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేసినట్లు ఆస్పత్రి అధినేత, సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి చెప్పారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2011 నుంచి అమెరికాలో త్రీడీ గోల్డ్ నీ ఇంప్లాంట్‌ను వినియోగిస్తున్నారని, మన దేశంలో కొన్ని ఆస్పత్రుల్లోనే దీనిని వాడుతున్నారని పేర్కొన్నారు. దీనిని అమర్చడం వల్ల మోకాలుకు అదనపు బలం రావడమే కాకుండా దృఢంగా ఉండడానికి, ఎక్కువ మడత రావడానికి దోహదపడుతుందన్నారు.

మోకాలు, తుంటి మార్పిడి ఆపరేషన్లలో వాడే ఇంప్లాంట్స్ రాపిడికి గురవడం వల్ల వాటి నుంచి ఎక్కువ మోతాదులో నికెల్, క్రోమియం, కోబాల్ట్ విడుదల అవుతాయని చెప్పారు. వీటి వల్ల జాయింట్ వాపునకు గురవడం, రియాక్షన్స్ రావడం జరుగుతుందని వెల్లడించారు. కానీ ఈ గోల్డ్ నీ ఇంప్లాంట్‌లో టైటానియం, నియోబియమ్ నైట్రైడ్ ఉండడం వల్ల రాపిడి, అరుగుదల తక్కువగా ఉండడంతో పాటు ఇతర సమస్యలు రాకుండా జాయింట్‌ను కాపాడతాయని చెప్పారు. ఇది సుమారు 30 ఏళ్ల పాటు పనిచేస్తుందన్నారు. అంతర్జాతీయ వైద్య సేవలను రాష్ట్ర ప్రజలకు తమ ఆస్పత్రిలో అందిస్తున్నందుకు ఆనందంగా ఉందని బూసిరెడ్డి చెప్పారు. సమావేశంలో ఆస్పత్రి సీఈవో డాక్టర్ ఎ.సాంబశివారెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు