అదరం.. బెదరం..

26 Feb, 2015 01:28 IST|Sakshi

మంగళగిరి : రాజధాని గ్రామాల్లో ఈ నెల 28వ తేదీ తరువాత ప్రభుత్వం భూ సేకరణకు దిగనుందని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ చేసిన ప్రకటనకు ఏ మాత్రం భయపడేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. వీరంతా న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. మరో వైపు ప్రభుత్వం జరీబు భూములకు ప్యాకేజీ పెంచే ఆలోచన చేస్తోందనీ, దీనిపై ముఖ్యమంత్రి రైతులను కలవనున్నారని ఆయా గ్రామాల్లో అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని సైతం వారు తిప్పికొడుతున్నారు.
 
 రాజధాని నిర్మాణానికి తమ భూములను ఇచ్చే ప్రసక్తేలేదని చెబుతుంటే ఇక పరిహారం మాటలెందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ నేతలంతా అండగా నిలవటం, భూ సమీకరణకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు లభించడంతో రైతులంతా తమ భూములను కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అంగీకార పత్రాలు ఇచ్చిన రైతులు కూడా వాటిని వెనక్కు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
 
  పంటలు పండే భూములను తీసుకోకూడదని భూసేకరణ చట్టంలో ఉందనీ,  మరో వైపు బహుళపంటలు పండే భూముల్ని ధ్వంసం చేస్తే ఆహార భద్రతకు ముప్పు వాటిల్లనుందనీ, ఇలాంటి పరిస్థితుల్లో  భూములను లాక్కోజూడడం ఎంత వరకు న్యాయమని రైతులు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి పనుల పేరుతో ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు మంగళగిరి నియోజకవర్గంలోని నవులూరు, ఎర్రబాలెం, బేతపూడి గ్రామాల్లో భూసేకరణ జరిపిందనీ, మళ్లీ  భూసేకరణ చేసే అవకాశం లేదని రైతులు చెబుతున్నారు. తమకు అండగా నిలుస్తున్న వైఎస్సార్ సీపీతో పాటు మిగిలిన అన్ని పార్టీలు, ప్రజాసంఘాల మద్దతుతో పోరాడి తమ భూములను కాపాడుకుంటాం కానీ, ఎట్టి పరిస్థితుల్లో భూములను ఇవ్వబోమని రైతులు ప్రతిజ్ఞలు చేస్తూ పోరాటాలకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా రైతుల ఆవేదన వారి మాటల్లోనే...
 

మరిన్ని వార్తలు