అభివృద్ధికి ‘చోటిచ్చారు..’

22 Feb, 2014 02:29 IST|Sakshi

కుంటాల, న్యూస్‌లైన్ : స్థలం కరువై ఎన్నో అభివృద్ధి పనులు కొనసా... గుతూనే ఉన్నాయి. మరికొన్ని అసలు నిర్మాణానికే నోచుకోవడం లేదు. మండల కేంద్రాల్లో గ్రంథాలయ భవనాల నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి రాజారాం మోహన్‌రాయ్ ఫౌండేషన్ సిద్ధంగా జిల్లాలో ఎక్కడా స్థలం లేకుండా పోయింది. అటు రెవెన్యూ అధికారులు గానీ.. ఇటు ప్రభుత్వం గానీ చొరవ తీసుకున్న దాఖాలాలు లేవు. ఫలితంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

 కానీ కుంటాల గ్రామస్తులు ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూడలేదు. ప్రభుత్వం నిధులు కేటాయించడంతో ఐకమత్యం ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ముందుకొచ్చారు. స్థలం కొరత ఏర్పడకుండా చూశారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు చందాలు వేసుకుని, వారసంత, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయానికి వచ్చే ఆదాయం, ఇతర ఆదాయాలతో స్థలం కొనుగోలు చేసి అప్పగించారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు సమకూరాయి. రాంనగర్‌కాలనీలో హన్మాన్ ఆలయాన్ని నిర్మించారు.

 1992లో సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.1.50లక్షలు వెచ్చించి ఎకరన్నర స్థలం కొనుగోలు చేశారు.

 2000లో ప్రభుత్వం ఎంపీడీవో కార్యాలయ నిర్మాణానికి రూ.14లక్షలు మంజూరు చేసింది. గ్రామస్తులు రూ.2లక్షలు సేకరించి ఐదెకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. దీంతో భవన నిర్మాణం పూర్తయింది.

 2007లో పోలీసుస్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.18లక్షలు కేటాయించింది. దీంతో గ్రామస్తులు రూ.3లక్షలు వెచ్చించి రెండెకరాల స్థలాన్ని అప్పగించారు.

 2012లో హైస్కూల్ అదనపు గదుల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు రూ.31.31లక్షలు కేటాయించింది. రూ.4లక్షలు వెచ్చించి నాలుగున్నర ఎకరాల స్థలం కొనుగోలు చేశారు.

 2013లో ఆదర్శ పాఠశాల నిర్మాణానికి రూ.21లక్షలు వెచ్చించి ఐదెకరాల స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చారు. ప్రస్తుతం భవనాల నిర్మాణం పూర్తయింది. 

మరిన్ని వార్తలు