చెక్‌పవర్ రాలే...

18 Aug, 2013 04:29 IST|Sakshi

వరంగల్, న్యూస్‌లైన్ : కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ప్రభుత్వం ఇంకా అధికారాలు ఇవ్వలేదు. పంచాయతీల్లో పలు పనులు, పారిశుద్ధ్య నిర్వహణకు కూడా రూపాయి ఖర్చు పెట్టేందుకు అధికారం రాలేదు. ఇప్పటివరకు స్పెషల్ ఆఫీసర్ల చేతిలో ఉన్న చెక్ పవర్ కూడా ఇంకా కేటాయించలేదు. గతంలో సర్పంచ్‌లకు చెక్ పవర్ ఉండేది. టీడీపీ హయాంలో సర్పంచ్‌లకు ఉన్న విశిష్ట అధికారానికి ఆంక్షలు విధించారు. సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులలో ఒకరికి జాయిం ట్ చెక్ పవర్ అధికారాన్ని కల్పించారు.

అయితే ప్రస్తుతం కొత్త సర్పంచ్‌లకు చెక్ పవర్ అధికారాన్ని ఎలా కల్పిస్తారనే విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారు గ్రామ పంచాయతీలోని విశిష్ట అధికారానికి ఇంకా దూరంగానే ఉన్నారు. జిల్లాలోని పంచాయతీ ఎన్నికలు ముగియగా ఈ నెల రెండో తేదీన సర్పంచ్‌లు అధికారికంగా బాధ్యతలను స్వీకరించారు. ఆ వెంటనే ప్రత్యేకాధికారులు తమ బాధ్యతల నుంచి వైదొలిగారు. గ్రామ పంచాయతీల నిధులకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేకాధికారులే చెక్ పవర్‌ను కలిగి ఉన్నారు. వారే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. వారు తమ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో చెక్ పవర్ రద్దు అయింది.

సర్పంచ్‌లుగా బాధ్యతలను స్వీకరించిన వారికి చెక్ పవర్ కల్పించాల్సి ఉండగా ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇచ్చేవారు కరువయ్యారు. ప్రతి నెల మొదటి వారంలోనే పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలనే చెల్లించాల్సి ఉంది. గ్రామ పంచాయతీలకు ఇంటి పన్నుల ద్వారా వసూలైన ఆదాయాన్ని బ్యాంకుల్లో నిలువ చేస్తారు.

ఏ పనికైనా చెల్లింపులు చెక్ రూపంలోనే ఉంటుంది. నూతనంగా ఎన్నికయిన సర్పంచ్‌లకు ఇంకా చెక్ పవర్ లేకపోవడంతో నిధులు డ్రా చేసే ఆవకాశం లేదు. దీంతో మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం, నీటి సరఫరా ఇబ్బందిగా మారింది. వేతనాలు లేకపోవడంతో కార్మికులు విధులకు గైర్హాజరవుతున్నారు. అంతేకాకుండా పన్నుల వసూళ్లు కూడా నిలిచిపోతున్నాయి. కాగా, సర్పంచ్‌లకు ఇంకా చెక్ పవర్ అధికారాలు రాలేదని, ఈ విషయం ప్రభుత్వ పరిధిలో ఉందని డీపీఓ ఈఎస్ నాయక్ పేర్కొన్నారు. చెక్ పవర్ లేకపోవడంతో కార్మికులకు వేతనాలు ఆగిపోయాయన్నారు.
 

మరిన్ని వార్తలు