నీటి వనరులపై చిన్నచూపు

10 Nov, 2013 03:55 IST|Sakshi

మర్పల్లి, న్యూస్‌లైన్:  ప్రభుత్వం చిన్ననీటి వనరులపై చిన్నచూపు ప్రదర్శిస్తోంది. దీంతో మండలంలోని చెరువుల్లో, కుంటల్లో పుష్కలంగా నీరు ఉన్నా రైతులకు ప్రయోజనం లేకుండాపోతోంది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. కాగా కొన్ని చెరువులు నాసిరకంగా నిర్మాణ పనులు చేపట్టటంతో నీరు లేక కళాహీనంగా దర్శనమిస్తున్నాయి. చెరువులు పూడిక మట్టితో నిండి ఉన్నాయి. మరికొన్ని చెరువుల్లో పిచ్చిమొక్కలు పెరగడంతో పూర్తిస్థాయిలో నీరు చేరటం లేదు. దీంతో ఆయకట్టు భూములకు సాగు నీరందే పరిస్థితి లేకుండాపోతోంది.
 సరిపడా అందని సాగునీరు
 మండలంలో 11 చెరువులు, 22 కుంటలు ఉన్నాయి. వీటి లోఅతిపెద్ధ ప్రాజెక్టు కొంషేట్‌పల్లి. కొంషేట్‌పల్లి ప్రాజెక్టు కలుపుకోని మండలంలో చెరువుల కింద 4,100 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. కానీ 500 ఎకరాలకు మించి సాగునీరు అందించిన దాఖలు లేవు. కొంషేట్‌పల్లి ప్రాజెక్టు కింద ఖరీఫ్ సాగుగా 1,250 ఎకరాలు, రబీలో 250 ఎకరాలకు సాగునీరు అందించాలి. కానీ  ఏనాడూ పూర్తిస్థాయిలో సాగునీరు అందించిన దాఖలు లేవు. ప్రాజెక్టు తూముల నుంచి నీరు వృథాగా పోతోంది. కొంషేట్‌పల్లి  ప్రాజెక్టు కుడి కాల్వ తూము పాడై నాలుగేళ్లవుతుఆన్న ఇంతవరకు మరమ్మతులకు నోచుకోవడంలేదు. దీంతో నీరు వృథాగా పోతోంది.
  కుడి, ఎడమ కాల్వలు పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. దీంతో నీరు ముందుకు వెళ్లని పరిస్థితి. కాల్వలు మరమ్మతులకు నోచుకోకపోవటంతో ప్రాజెక్టు చివరి ప్రాంతంలోని ఆయకట్టుకు నీరందడంలేదు.
 చెరువుల దుస్థితి చెప్పతరమా..
 కొంషేట్‌పల్లి ప్రాజెక్టు పరిస్థితి ఇలా ఉంటే ఇక చెరువులు మరీ అధ్వానంగా ఉన్నాయి. పంచలింగాల చెరువుద్వారా రబీలో 480 ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది. కానీ 100 ఎకరాలకు మించి సాగు కావటంలేదని ఆయకట్టుదారులు అంటున్నారు. చెరువు నుంచి వృథాగా పోతున్న నీటిని తప్పనిసరి పరిస్థితుల్లో ఆయిల్ ఇంజిన్ల ద్వారా నీటిని తోడుకోని పంటలకు నీరందిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. రావులపల్లి చెరువు కింద 329 ఎకరాల ఆయకట్టుదారులకు నీరు అందించాల్సి ఉండగా ఏనాడూ 50 ఎకరాలకు మించి రబీ సాగు కావటంలేదని ఆయకట్టుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్‌ఖోడ చెరువు కింద ఉన్న 568 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాలి. కానీ ఏనాడూ కాల్వల ద్వారా నీరు అందించిన దాఖలు లేవు. కల్‌ఖోడలో కుడి కాల్వ నిర్మాణ పనులు చేపట్టలేదు. ఎడమ కాల్వ నిర్మించినా ఇంతవరకు దానిలోకి నీరు వదలలేదు.
  మరమ్మతుల పేరుతో మాత్రం ఇప్పటివరకు మూడుసార్లు పనులు చేపట్టి నిధులు కాజేశారు. ఇక పిల్లిగుండ్ల, నర్సాపూర్, ఘనాపూర్, పట్లూర్, వీర్లపల్లి, సిరిపురం, తిమ్మాపూర్,  కొంషేట్‌పల్లి పాత చెరువుల పనులు నాసిరకంగా చేపట్టడంతో  తూముల నుంచి నీరు వృథాగా పోతోందని ఆయా గ్రామాల ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలోని 22 కుంటలు పూడిక తీతతో నిండిపోయి నిరుపయోగంగా మారాయి.

మరిన్ని వార్తలు