ఉందిలే కరువు నేల 'అనంత'కు మంచికాలం 

22 Nov, 2019 08:05 IST|Sakshi

13వేల ఎకరాల భారీ భూ బ్యాంకు 

పరిశ్రమల కోసం సిద్ధం చేస్తున్న ఏపీఐఐసీ 

ఐదేళ్ల కోసం ముందస్తు ప్రణాళిక 

నియోజకవర్గానికో పారిశ్రామిక పార్కు 

వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి 

పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా ప్రభుత్వ నిర్ణయం 

పారిశ్రామిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కరువు జిల్లాలో మానవ వనరులకు కొదవ లేకపోవడం.. సాంకేతిక చేయూతకు యూనివర్సిటీలు సిద్ధంగా ఉండటం.. మెరుగైన రవాణా సౌకర్యం.. అన్నింటికీ మించి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి.. వెరసి కంపెనీల ఏర్పాటుకు ‘అనంత’ సాదర స్వాగతం పలుకుతోంది. ఇందులో భాగంగా రానున్న ఐదేళ్ల కాలంలో 13వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) ప్రణాళికను సిద్ధం చేసుకుంది. 

సాక్షి, అనంతపురం: జిల్లాలో కేవలం వ్యవసాయం మీదనే ఆధారపడి ప్రజానీకం జీవనం సాగిస్తున్నారు. అయితే, పొలాలకు కూడా వర్షాలే దిక్కు. ఈ నేపథ్యంలో పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి చేస్తేనే పేదరికాన్ని పారదోలే అవకాశం ఉంటుంది. ఇదే అంశాన్ని కొద్దిరోజుల క్రితం రాష్ట్ర రాజధానితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సమావేశంలో కూడా జిల్లా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మరోవైపు పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 2020–25 సంవత్సరాలకు నూతన పారిశ్రామిక విధానాన్ని వచ్చే ఏడాదిలోనే ప్రకటించనుంది. ఇందులో వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోనున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నియోజకవర్గానికో పారిశ్రామిక పార్కు ఏర్పాటు దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఏదైనా పరిశ్రమ జిల్లాలో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వెంటనే అనువైన భూమిని చూపించేందుకు భారీ భూ బ్యాంకును సిద్ధం చేస్తుండటం విశేషం. 

మౌలిక సదుపాయాల్లో మేటి 
రాష్ట్ర విభజన తర్వాత మొత్తం 13 జిల్లాలో భారీగా భూమి లభ్యమయ్యే జిల్లాల్లో అనంత రెండో స్థానంలో ఉంది. కర్నూలులో ఇప్పటికే 30వేల ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. ఆ తర్వాత ఎక్కువ భూమి లభించే ప్రాంతం అనంతనే. అందువల్ల ఏదైనా పరిశ్రమ నెలకొల్పేందుకు ముందుకు వస్తే.. అవసరమైన భూమిని చూపించేందుకు ఈ  భూ బ్యాంకు దోహదపడనుంది. ఇక పరిశ్రమలకు అవసరమయ్యే విద్యుత్‌తో పాటు బెంగళూరు విమానాశ్రయం కేవలం 200 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కొత్తగా అనంతపురం నుంచి అమరావతికి రహదారి నిర్మాణం జరగనుంది. తద్వారా రాష్ట్ర రాజధానికి కూడా కనెక్టివిటీ ఏర్పడనుంది. పుట్టపర్తి విమానాశ్రయాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాలనే యోచనలో ఉంది. తద్వారా ఆయా కంపెనీల ఉద్యోగుల రాకపోకలకు మరింత అనువుగా ఉండనుంది. ఇప్పటికే హిందూపురంలో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇక మానవ వనరులు జిల్లాలో పుష్కలంగా ఉన్నాయి. యూనివర్సిటీలు కూడా ఉన్న నేపథ్యంలో సాంకేతిక నిపుణుల కొరత కూడా ఇబ్బంది కూడా లేదు. మొత్తమ్మీద జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి అనువైన మౌలిక సదుపాయాలున్న నేపథ్యంలో భూమిని కూడా సిద్ధం చేయడం ద్వారా యువతకు మరింత ఉపాధి లభించే అవకాశం ఏర్పడనుంది. 

జిల్లాలో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ యూనిట్‌ 
జిల్లాలో ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ యూనిట్‌ ఏర్పాటు కానుంది. సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో వీరా వాహన ఉద్యోగ్‌ లిమిటెడ్‌ కంపెనీ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. యూనిట్‌ ద్వారా ఏడాదికి 3వేల బస్సులు జిల్లాలో తయారు కానున్నాయి. ఇందుకు అనుగుణంగా సదరు సంస్థకు ఏపీఐఐసీ ద్వారా 120 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం భూ బ్యాంకును సిద్ధం చేస్తున్న తరుణంలో ఓ కంపెనీ తమ యూనిట్‌ ఏర్పాటుకు ముందుకు రావడం శుభపరిణామం.

ఏడాదిలో భూసేకరణ లక్ష్యం 
మండలం    భూ విస్తీర్ణం (ఎ‘‘ల్లో) 
కనగానపల్లి    3606.26 
ధర్మవరం    533.52 
కళ్యాణదుర్గం    106.07 
గుంతకల్లు    103.97 
అనంతపురం    33.38 
కదిరి    93.11 
ఉరవకొండ    26.21 
మడకశిర    1648.82 
పెనుకొండ    21.17 
పుట్టపర్తి    522.39  

మరిన్ని వార్తలు