Fact Check: కొల్ల‘గొట్టి పాటి’! 

23 Nov, 2023 06:03 IST|Sakshi

ఉమ్మడి ప్రకాశంలో క్వారీలు మింగేసిన గొట్టిపాటి రవి 

ప్రలోభాలతో టీడీపీలోకి ఫిరాయించి యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌ 

2014లో గొట్టిపాటి రవి సైకిల్‌ ఎక్కిందే అందుకు.. 

అక్రమాలపై గనుల శాఖ ఉక్కుపాదం.. ఇతర జిల్లాల్లోనూ తనిఖీలు  

రాజ్యహింస అంటూ రామోజీ శివాలు   

సాక్షి, అమరావతి /బాపట్ల: సహజ వనరులను కొల్లగొట్టిన ఓ ఘనాపాఠికి పేదల భూములు అప్ప­నంగా మింగేసిన ఓ పెద్దమనిషి వత్తాసు పలు­కుతున్నారు! గురివింద సామెతను విస్మరించి రాబందుల రాజ్యహింస అంటూ శివాలెత్తిపో­యా­రు! ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యథేచ్చగా గనుల విధ్వంసానికి పాల్పడిన టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపా­టి రవికుమార్‌ ఉత్తముడంటూ ఈనాడు రామోజీ కీర్తిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన గొట్టిపాటి గత చరిత్రను దాచేందుకు రామోజీ తంటాలు పడ్డా ప్రజలు మరచిపోరు కదా!!

ప్రలోభాలతో ఫిరాయించి అక్రమాలు..
2014లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన గొట్టిపాటి రవికుమార్‌ ఆ తరువాత టీడీపీలో ఎందుకు చేరారనే వాస్తవాన్ని రామోజీ కావాలనే కప్పిపుచ్చారు. నాటి సీఎం చంద్రబాబు ప్రలోభాలకు గురి చేయడంతో పార్టీ ఫిరాయించిన గొట్టిపాటి అనంతరం టీడీపీ సర్కారు అండతో యథేచ్ఛగా గనులను కొల్లగొట్టారు. క్వారీల అనుమతులు రద్దు కాకుండా లోకేశ్‌కు భారీ మొత్తంలో కప్పం చెల్లించారు.

విఫలయత్నాలు..
2019 ఎన్నికల్లో గొట్టిపాటి రవి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈదఫా వైఎస్సార్‌ సీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో మళ్లీ పార్టీ ఫిరాయించేందుకు ప్రయత్నించి భంగపడ్డారు. తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరతానంటూ పలువురి ద్వారా రాయబారాలు పంపిన గొట్టిపాటి కొంతకాలం టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆయన కప్పదాటు వైఖరి తేటతెల్లం కావడంతో అధికార పార్టీ అందుకు అంగీకరించలేదు.

దాదాపు రెండేళ్లపాటు ఎడతెగని ప్రయత్నాలు చేసిన గొట్టిపాటి ఇక లాభం లేదని మిన్నకుండిపోయారు. ఈనాడు రామోజీ దీన్ని వక్రీకరిస్తూ గొట్టిపాటి వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ఒప్పుకోకపోవడంతోనే కేసులు నమోదు చేశారంటూ కట్టుకథలు అల్లేశారు. గనుల అక్రమ తవ్వకాలపై విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించింది. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, నెల్లూరు తదితర జిల్లాల్లో కూడా తనిఖీలు జరిపి అక్రమాలపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసింది. 

తనిఖీల తరువాతే కేసులు
♦ బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొనిదిన గ్రామం వద్ద  కిషోర్‌స్లాబ్‌ అండ్‌ టైల్స్‌ పేరుతో గొట్టిపాటికి 6.4 హెక్టార్లలో గ్రానైట్‌ క్వారీ ఉంది. 2019 నవంబరు 23న తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల బృందం 42,676 క్యూబిక్‌ మీటర్ల గ్రానైట్‌ను పర్మిట్లు లేకుండా అక్రమంగా అమ్మేసినట్లు నిర్ధారించింది. దీంతో నిబంధనల ప్రకారం రూ.87.45 కోట్లు జరిమానా విధించింది.
♦ బల్లికురవ మండలం కొనిదిన పరిధిలో అంకమచౌదరి పేరుతో సర్వే నంబర్‌ 103లో నాలుగు హెక్టార్ల విస్తీర్ణంలో క్వారీ ఉంది. అందులో 43,865 క్యూబిక్‌ మీటర్ల రాయిని అక్రమంగా తరలించినట్లు తేలడంతో రూ.  54. 23 కోట్లు జరిమానా విధించారు. 
♦ బల్లికురవ మండలం కొనిదిన పరిధిలోనే  కిషోర్‌ గ్రానైట్స్‌ పేరిట 0.093 హెక్టార్లలో ఉన్న క్వారీలో 42,056 క్యూబిక్‌ మీటర్ల మేర అక్రమంగా తవ్వేసి తరలించడంతో రూ.87.30 కోట్లు జరిమానా విధించారు. 
♦ సంతమాగులూరు మండలం గురిజేపల్లివద్ద కిషోర్‌ గ్రానైట్స్‌ పేరిట గొట్టిపాటికి 4.10 హెక్టార్లలో క్వారీ ఉంది. అందులో 19,752  క్యూబిక్‌ మీటర్ల మేర గ్రానైట్‌ను అక్రమంగా తవ్వి తరలించడంతో రూ.45.68 కోట్లు జరిమానా విధించారు. గొట్టిపాటి జరిమానా చెల్లించకపోవడంతో నిబంధనలను అనుసరించి క్వారీ అనుమతి రద్దు చేశారు. పన్నులు చెల్లించకపోవడంతో మరో 30 క్వారీల యజమానులకు కూడా గనుల శాఖ నోటీసులు జారీ చేసింది. వీటిని కప్పిపుచ్చుతూ కేవలం గొట్టిపాటినే వేధిస్తున్నారంటూ ఈనాడు దుష్ప్రచారానికి దిగింది.

చట్ట ప్రకారమే జరిమానాలు
మైనింగ్‌ నిబంధనలు ఉల్లంఘించిన గొట్టిపాటి రవికుమార్‌కు చట్ట ప్రకారమే జరిమానా విధించామని, దాన్ని వక్రీకరిస్తూ రాబందుల రాజ్యహింస అంటూ ఈనాడు పచ్చి అబద్ధాలతో కథనం ప్రచురించిందని మైనింగ్‌ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి పేర్కొన్నారు. గనుల శాఖకు, ప్రభుత్వానికి రాజకీయ దురుద్దేశాలను ఆపాదించటాన్ని ఖండించారు. క్వారీలను తనిఖీ చేయడం, ఉల్లంఘనలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం గనుల శాఖ విధుల్లో భాగమన్నారు. లీజు­దారుల రాజకీయ ప్రాధాన్యతలతో తమకు సంబంధం ఉండదన్నారు.

2019లో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని గ్రానైట్‌ క్వారీలపై తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన పలు క్వారీలకు జరిమానాలు విధిస్తూ నోటీసులు జారీ చేశామన్నారు. గొట్టిపాటి రవికుమార్‌కు చెందిన 11 క్వారీల్లో మేనేజర్లు, సిబ్బంది సమక్షంలోనే  తనిఖీలు జరిగినట్లు తెలిపారు. రూ.45 కోట్ల మేర ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించి చట్ట ప్రకారం ఐదు రెట్లు అధికంగా రూ.270 కోట్లు జరిమానా విధించినట్లు తెలిపారు. ఇందులో కక్ష సాధింపులకు ఆస్కారం లేదన్నారు. గొట్టిపాటి రివిజన్‌కు అప్పీలు చేసుకోలేదన్నారు.

దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలు గనుల శాఖ పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాలోని 240 క్వారీల నుంచి గనుల శాఖకు ఏటా రూ.400 కోట్ల మేర రెవెన్యూ వస్తోందన్నారు. ఒక్క గొట్టిపాటి క్వారీలపై చర్యలు తీసుకోవడం వల్ల ఏటా రూ.100 కోట్ల రెవెన్యూను ప్రభుత్వం నష్టపోయినట్లు ఈనాడు ఏ లెక్కల ఆధారంగా రాసిందో చెప్పాలన్నారు. తప్పుడు కథనాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
–మైనింగ్‌ డైరెక్టర్‌ వెంకటరెడ్డి 

మరిన్ని వార్తలు