రాయదుర్గం టికెట్‌పై టీడీపీ కేడర్‌లో అయోమయం

23 Nov, 2023 12:28 IST|Sakshi

రాయదుర్గం: సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగుదేం పార్టీలో అసమ్మతి సెగలు కక్కుతోంది. ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు కేడర్‌ను కలవర పెడుతోంది. అప్పుడే పలువురు ఆశావహులు టికెట్‌ కోసం రేసు మొదలు పెట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఇలాకా అయిన రాయదుర్గంలో ఈసారి ఎమ్మెల్యే టికెట్‌ స్థానికులకే ఇవ్వాలనే డిమాండ్‌ పెరుగుతోంది. పార్టీలోని పలువురు సీనియర్లు ఇప్పటికే రహస్య సమావేశాలు నిర్వహించి.. తమ అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో మాజీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, జిల్లాపరిషత్‌ మాజీ చైర్మన్‌ పూల నాగరాజు సమావేశమయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చినట్టు తెలుస్తోంది. అనంతరం వారిద్దరూ చంద్రబాబు నివాసం వద్ద కలిసి దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇది పార్టీలోనూ, ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.

2014కు ముందు టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేసి చివర్లో కాలవ శ్రీనివాసులు చేతిలో పెట్టాల్సి వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో ఆయన్ని రాయదుర్గం నుంచి తప్పించి ఆ అవకాశం తనకే ఇవ్వాలని దీపక్‌రెడ్డి పట్టుబట్టినట్టు విశ్వశనీయవర్గాల సమాచారం. స్థానికులకు అవకాశం కల్పించాల్సి వస్తే వాల్మీకి సామాజికవర్గానికి చెందిన పూల నాగరాజు పేరు ప్రస్తావనకు తెచ్చినట్టు తెలుస్తోంది. కాలవ శ్రీనివాసులుకై తే తమ మద్దతు ఉండబోదని తెగేసి చెప్పినట్టు పార్టీలో బలంగా వినిపిస్తోంది.

ఇక్కడో మాట.. అక్కడో మాట..
చంద్రబాబు రాయదుర్గం పర్యటనలో ఇక్కడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాలవ శ్రీనివాసులు పేరు ప్రస్తావించినప్పటికీ ఆ మరుసటి దినమే నంద్యాల సభలో మాటమార్చారు. అందరి అభిప్రాయం తీసుకున్నాకే అభ్యర్థిత్వం ఖరారు చేస్తామని కుండబద్దలు కొట్టారు. అంతేకాక ఎన్నికల సమయంలోనే సీట్లపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో కాలవ అభ్యర్థిత్వంపై కేడర్‌ పునరాలోచనలో పడినట్లయ్యింది.

► తాజాగా దీపక్‌రెడ్డి, పూల నాగరాజు భేటీ తర్వాత టీడీపీ కేడర్‌లో మరింత గందరగోళానికి దారి తీసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కూడా వీరి పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నట్టు వారి కేడర్‌ ప్రచారం చేసుకుంటోంది. దీనికి తోడు రాయదుర్గంలో ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్న వైఎస్సార్‌సీపీని ఎదుర్కోవాలంటే బలమైన వ్యూహం అవసరమని టీడీపీ భావిస్తోంది. నేతల మధ్య అసంతృప్తులు, విభేదాలు ఉంటే గట్టెక్కడం కష్టమేనని అంచనా వేస్తోంది.

అభ్యర్థుల మార్పులో చంద్రబాబు దిట్ట..

సర్వేల పేరుతో తరచూ అభ్యర్థులను మార్చడంలో చంద్రబాబు దిట్ట. 1989లో కాట గోవిందప్పతో సేవలు చేయించుకుని... 1994లో బండి హులికుంటప్పకు టీడీపీ ఎమ్మెల్యే టికెట్టు కట్టబెట్టారు. ఆ తర్వాత 1999లో పూజారి జితేంద్రప్పను తెరమీదకు తెచ్చారు. 2004లో మెట్టు గోవిందరెడ్డికి అవకాశం కల్పించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో దీపక్‌రెడ్డికి టిక్కెట్టు ఇచ్చారు. 2014 వరకు అతడితో సేవ చేయించుకుని ఎన్నికలకు 20 రోజుల ముందు అనూహ్యంగా కాలవ శ్రీనివాసులును తీసుకొచ్చారు. తిరిగి 2019లో ఆయనకే మరో అవకాశం కల్పించారు. ఇలా వరుసగా అభ్యర్థులను మార్చే చంద్రబాబు ఈసారి కూడా అలాంటి పంథానే అవలంబిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు