ఖనిజం ఫుల్... ‘ఖజానా’ నిల్..

3 Jan, 2014 03:48 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సహజ సంపదకు జిల్లా పెట్టింది పేరు. బొగ్గు నిల్వలు మొదలుకుని అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యధిక డిమాండ్ ఉన్న వివిధ రకాల ఖనిజాల వరకు అనేకం ఇక్కడ లభ్యమవుతాయి. జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువ కావడంతో ఇతర ప్రాంతాల్లో దొరకని ఖనిజాలు సైతం ఇక్కడ లభ్యమవుతుంటాయి. బొగ్గు నిల్వలు,  బారైట్స్, ఐరన్ ఓర్, డోలమైట్, మైకా వంటి ఖనిజాలతో పాటు రాష్ట్ర అవసరాలు తీర్చే స్థాయిలో నిల్వల గల ఇసుక రీచ్‌లు అనేకం ఉన్నాయి. ఇలా సహజ సంపదకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జిల్లాలో మైనింగ్ శాఖ పరిస్థితి మాత్రం కొంత దయనీయంగా ఉంది. వేలకోట్ల విలువైన సహజ సంపద ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోకపోవడం, పూర్తిస్థాయిలో అజమాయిషీ లేకపోవడంతో వాటన్నింటినీ పర్యవేక్షించే మైనింగ్ శాఖకు ఆదాయం నామమాత్రంగానే ఉంది.
 
 జిల్లాలో సుమారు 12 రకాలకు పైగా వివిధ రకాల లోహాలు, నిల్వలు ఉన్నాయి. వీటికి సంబంధించి లీజు కేటాయింపులన్నీ పూర్తిస్థాయిలో చేపట్టకపోవడంతో అనుకున్నంత ఆదాయం రావడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని మైనింగ్ శాఖ అతి కష్టం మీద అధిగమించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులు, అందుబాటులోగల గనులను పరిగణలోకి తీసుకుని జిల్లాకు ఈ ఏడాది కేవలం రూ.37 కోట్ల వార్షిక లక్ష్యాన్ని మాత్రమే ప్రభుత్వం నిర్దేశించగా... రూ.40 కోట్లు వసూలైంది. జిల్లాలోని ఖనిజ వనరులన్నిటినీ సక్రమంగా వినియోగంలోకి తీసుకొస్తే ఇంతకంటే రెండింతల ఆదాయం సాధ్యమవుతుందని పరిశీలకులు చెబుతున్నారు. గతంలో మైనింగ్ శాఖ పరిధిలో ఉండే ఇసుక రీచ్‌లను జిల్లా పరిషత్‌లకు కట్టబెట్టడంతో ఈ వ్యవహారం అక్రమాలకు కేంద్రబిందువుగా మారింది. జిల్లాలో మేజర్ మినరల్స్ కేటగిరిలో మొత్తం 12 రకాల లోహాలకు గాను, 15,037 హెక్టార్లలో 65 లీజ్‌లు కేటాయించారు. ఇందులో ఖమ్మం మైనింగ్ అసిస్టెంట్‌ై డెరెక్టర్ పరిధిలో 694.887 హెక్టార్ల విస్తీర్ణంలో లభ్యమయ్యే బారైట్, రంగురాళ్లు, డోలమైట్, ఐరన్‌ఓర్, అబ్రకం, పలుగురాళ్లు, బొగ్గు నిల్వలకు సంబంధించి 22 లీజులు ఉన్నాయి. కొత్తగూడెం మైనింగ్ ఏడీ పరిధిలో వీటితోపాటు అత్యధికంగా 12 బొగ్గు గనులు, 43 ప్రైవేట్ లీజ్‌లు ఉన్నాయి. వాస్తవానికి జిల్లాలో బొగ్గుతోపాటు ఐరన్‌ఓర్ గనులు పుష్కలంగా ఉన్నాయి.
 
 గత కొంతకాలంగా ఐరన్‌ఓర్‌కు సంబంధించి సమస్యలు ఉత్పన్నం అవడంతో కేటాయించిన మూడు లీజులు కూడా పనిచేయడం లేదు. అనేక సమస్యలను అధిగమించి నేలకొండపల్లి ప్రాంతంలో 17 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న లో గ్రేడ్ ఐరన్‌ఓర్ ఇటీవలే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించింది. దీంతోపాటు బయ్యారం ప్రాంతంలో 70 హెక్టార్లు, భధ్రాచలం డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో 3 వేల హెక్టార్లలో ఐరన్‌ఓర్ నిల్వలు ఉన్నప్పటికీ అటవీ చట్టాలు, పర్యావరణ సమస్యలు వంటి రకరకాల కారణాలతో అవన్నీ నిలిచిపోయాయి.  అయితే వీటన్నింటినీ సక్రమంగా వినియోగంలోకి తెస్తే ఏటా రూ.100 కోట్లకు పైగా ప్రభుత్వానికి రాయల్టీ వచ్చే అవకాశం ఉంది. వీటితోపాటు మైనర్ మినరల్స్ కేటగిరిలో 305 లీజులు ఉన్నాయి. ఇవి 478.350 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా నల్లరాయి లీజులే 205 ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం కూడా మైనర్ మినరల్స్ నుంచే అధికంగా ఉంది. ప్రసుత్తం వస్తున్న ఆదాయంలో 30 శాతం గ్రానైట్ నుంచి, 20 శాతం డోలమైట్ నుంచి, 50 శాతం స్టోన్ మెటల్ నుంచి సమకూరుతోంది.
 
 పుష్కలంగా ఇసుక నిల్వలు...
 జిల్లాలో 45కు పైగా ఇసుక రీచ్‌లున్నాయి. వీటిలో భద్రాచలం పరిధిలోని 11 ఇసుక రీచ్‌లను గతంలో ఎస్టీలకు కేటాయించారు. వాటిలో 7 రీచ్‌లు ఇప్పటికే మూతపడ్డాయి. గోదావరి నదీ తీరప్రాంతంలో ఉన్న రీచ్‌ల్లో వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నాయి. రెండేళ్ల క్రితం వరకు ఇసుక రీచ్‌ల కేటాయింపు వ్యవహారం మైనింగ్‌శాఖ ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత వీటిని జిల్లా పరిషత్‌కు కేటాయించడం, రీచ్‌ల్లో భారీగా అక్రమాలు జరగడంతో ప్రస్తుతం అన్ని రీచ్‌లూ మూతపడ్డాయి. అయితే వందల లారీల ఇసుక నిత్యం అక్రమంగా రవాణా అవుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రభుత్వం రూ. కోట్ల ఆదాయం  కోల్పోవాల్సి వస్తోంది.
 
 ప్రభుత్వానికి నివేదిక పంపాం : ఏడీ
 జిల్లాలో సహజ సంపద నిల్వలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపామని ఖమ్మం డివిజన్ మైనింగ్‌శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ ఎస్.వెంకటరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. పలు కేటాయింపుల్లో సాంకేతిక సమస్యలు, కోర్టు ఇబ్బందులు ఉండటంతో జరగలేదని, త్వరితగతినే అన్నీ పూర్తవుతాయని వివరించారు.

మరిన్ని వార్తలు