మానవత్వం చాటిన గూడూరు సబ్‌కలెక్టర్‌ 

27 Oct, 2019 13:21 IST|Sakshi
క్షతగాత్రురాలిని ఆస్పత్రికి చేరుస్తున్న సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ  

రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు 

తన వాహనంలో ఆస్పత్రికి తరలించిన సబ్‌కల్టెర్‌ 

సాక్షి, నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైవే పక్కన నిస్సహాయ స్థితిలో పడిఉన్న ఓ మహిళను అదే మార్గంలో వస్తున్న గూడూరు సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ గమనించి తన వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటన మనుబోలు మండల పరిధిలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు..ఇందుకూరుపేటకు చెందిన ఇటుకల ప్రసన్న తన తమ్ముడు చందుతో కలిసి మోటార్‌బైక్‌పై గూడూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో మనుబోలు పోలీస్‌స్టేషన్‌ సమీపంలో మోటారుసైకిల్‌పై వెనకగా కూర్చుని ఉన్న ప్రసన్న అదుపుతప్పి కింద పడిపోయింది. ఇది గమనించని సోదరుడు ముందుకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తరువాత అదే మార్గంలో నెల్లూరు నుంచి గూడూరు వస్తున్న సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ హైవే పక్కన పడిపోయి ఉన్న ప్రసన్నని గమనించి వాహనం ఆపారు.

గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న ప్రసన్నను తన సిబ్బంది సాయంతో వాహనంలో మనుబోలు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో సబ్‌కలెక్టర్‌ నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి వెంటనే మెరుగైన చికిత్స కోసం నెల్లూరు తరలించేలా చర్యలు తీసుకున్నారు. అంతకుముందే సమాచారం అందుకున్న తమ్ముడు పీహెచ్‌సీకి చేరుకుని అక్క వెంట వెళ్లాడు. కళ్ల ముందే ప్రమాదం జరిగినా మనకెందుకులే అని చేతులు దులుపుకొని వెళ్లే రోజుల్లో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్న సబ్‌కలెక్టర్‌ను పలువురు అభినందించారు. 

మరిన్ని వార్తలు