చేనేత రంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం

9 Jan, 2014 03:39 IST|Sakshi
చేనేత రంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం

కాగజ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్: వ్యవసాయం తర్వాత అధిక శాతం ప్రజలు ఆధారపడిన చేనేత రంగాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని పద్మశాలి సేవా సంఘం తెలంగాణ అధ్యక్షుడు గోశిక యాదగిరి విమర్శించారు. హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో వచ్చే నెల 23న నిర్వహించనున్న పద్మశాలి యువజన గర్జన విజయవంతానికి పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర బుధవారం రాత్రి పట్టణానికి చేరింది. ఈ సందర్భంగా పద్మశాలి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
 పద్మశాలీలు జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందని అన్నారు. చేనేత కార్మికులు ఆకలిచావులకు గురవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపించారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. తెలంగాణలో 15 శాసనసభ, మూడు పార్లమెంటు స్థానాలు పద్మశాలీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. పద్మశాలీల డిమాండ్ల సాధనకు నిర్వహించే గర్జనను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం గర్జన ఫ్లెక్సీలను విడుదల చేశారు. అంతకుముందు పట్టణంలో మోటార్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆప్కో మాజీ చైర్మన్ గడ్డం జగన్నాథం, పద్మశాలి సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఎనగంటి రాజమౌళి, కార్యవర్గ సభ్యులు గుల్లపల్లినర్సయ్య, గుల్లపల్లి బుచ్చిలింగం, నల్ల కనకయ్య, కొంగ సత్యనారాయణ, తాలూకా అధ్యక్షుడు ఒడ్నాల వెంకన్న, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.సదానందం, రాపెల్లి నాగేశ్వర్‌రావు, యూత్ జిల్లా అధ్యక్షుడు మాచర్ల శ్రీనివాస్, నాయకులు పర్శ చంద్రశేఖర్, మామిడాల తిరుపతయ్య, గుల్లపల్లి లావణ్య, మామిడాల మమత పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు