ఆయనది భీమిలి పట్టు

18 Aug, 2015 01:54 IST|Sakshi
ఆయనది భీమిలి పట్టు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :  వడ్డించేవాడు మనవాడైతే... అన్నట్లుగా తయారైంది జీవీఎంసీ నిధుల కేటాయింపు వ్యవహారం. ఈ అంశం నగర పరిధిలోని పలువురు ఎమ్మెల్యేల ఆగ్రహానికి కారణమవుతోంది. భీమిలి నియోజకవర్గానికి అత్యధిక నిధులు కేటాయించి ఇతర నియోజకవర్గాలపట్ల శీతకన్ను వేశా రు. అసలే జీవీఎంసీపై మంత్రి గంటా ఏకఛత్రాధిపత్యం పట్ల అసంతృప్తిగా ఉన్న ఇతర ఎమ్మెల్యేలకు తాజా పరిణామం మరింత ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇటీవల జీవీఎంసీ ప్రతిపాదించిన రూ.7,200కోట్ల పనుల్లో దాదాపు 2,200కోట్లు ఒక్క భీమిలి నియోజకవర్గాకే కేటాయించడం గమనార్హం.
 
 తూర్పు నియోజకవర్గానికి కొంత ప్రాధాన్యమిచ్చారు. మిగిలిన నియోకజవర్గాలకే నామమాత్రంగానే నిధులు విదిల్చడంతో టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులను డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)ను అధికారులు రూపొందించి ప్రభుత్వానికి నివేదిం చారు. రూ.7,200కోట్ల నిధులతో ఈ డీపీఆర్‌ను రూపొందిం చారు. వాటిలో భీమిలి నియోజకవర్గాకే సింహభాగం పనులు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. వరద నీరు డ్రైనేజీ వ్యవస్థ కోసం భీమిలికి ఏకంగా రూ.1,300కోట్లు కేటాయించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.300 కోట్లతో పనులు ప్రతిపాదించారు.
 
 మధురవాడతోపాటు జీవీఎంసీలో కొత్తగా విలీన పంచాయతీల కోసం రూ.600 కోట్లు కేటాయించారు. అంటే రూ.2,200కోట్లు భీమిలి నియోజకవర్గంలో పనుల కోసమే ప్రతిపాదించినట్లు స్పష్టమైంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో  కూడా  వరద నీటి డ్రైనేజీ కోసం రూ850కోట్లు ప్రతిపాదించారు.  కానీ ఇతర నియోజకవర్గాల్లో పనులకు మాత్రం జీవీఎంసీ నిధులు విదల్చనే లేదు. వరద ముంపు తీవ్రత ఎక్కువగా ఉన్న విశాఖ దక్షిణ, విశాఖ ఉత్తర, విశాఖ పశ్చిమ నియోజకవర్గాల గురించి జీవీఎంసీ అసలు పట్టించుకోనే లేదు. ఈ ప్రాంతంలో కొండవాలు కాలనీలు, లోతట్లు ప్రాంతాలు ఉన్నప్పటికీ వరద నీటి డ్రైనేజీ వ్యవస్థ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రతిపాదించ లేదు.
 
 ఇక తాడో పేడో
 జీవీఎంసీ తీరుపై నగరంలోని ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగలిపోతున్నారు.  తమతో కనీసం సంపరదించకుండానే డీపీఆర్ ఎలా రూపొందిస్తారని ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, గణబాబు, పల్లా  శ్రీనివాస్,  విజయ్‌కుమార్‌రాజు గుర్రుగా ఉన్నారు. పారిశుధ్య కార్మికుల సమ్మె సమయమంలో మున్సిపల్ మంత్రి నారాయణ నిర్లక్ష్యపూరిత వైఖరిపై విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బహిరంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జీవీఎంసీ నిధుల కేటాయింపులో కూడా నియోజకవర్గానికి మొండిచెయ్యి చూపడంపై ఆయన మరింతగా మండిపడుతున్నారు. సీఎం వద్దే తాడోపేడో తేల్చుకుంటానని ఆయన తన సన్నిహితుల వద్ద వాఖ్యానిస్తున్నారు. విశాఖ  దక్షిణ, పశ్చిమ, గాజువాక నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, గణబాబు, పల్లా  శ్రీనివాస్ కూడా ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. మున్సిపల్ మంత్రితో చెప్పినా ఫలితం ఉండదని నేరుగా సీఎంతోనే మాట్లాడతామని వారు చెబుతున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే తాము  డివిజన్లలో తిరగలేమని కార్యకర్తల సమక్షంలోనే ఆగ్రహంగా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
 

మరిన్ని వార్తలు