హెడ్‌కానిస్టేబుల్ దంపతుల దుర్మరణం

14 Aug, 2015 23:42 IST|Sakshi
హెడ్‌కానిస్టేబుల్ దంపతుల దుర్మరణం

మరో ముగ్గురికి తీవ్రగాయాలు
మృతులు ఒడిశా బాజీనగర్ వాసులు

 
కశింకోట: రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ దంపతులు దుర్మరణం చెందారు. మండలంలోని పరవాడపాలెం కూడలి సమీపంలో శుక్రవారం ఉదయాన్నే 5.30 గంటల సమయంలో ఈ విషాదకర దుర్ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి ఒడిశా గంజాం జిల్లా బాజీనగర్‌కు వెళుతున్న ఓ ప్రైవేటు అంబులెన్స్ అదుపు తప్పి ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. గ్యాస్ట్రిక్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న హెడ్ కానిస్టేబుల్ హరిప్రసాదరావు విజయవాడ ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో వైద్యం పొంది తాను పని చేస్తున్న ప్రాంతానికి సమీపంలోని బెర్హంపూర్‌లో వైద్యానికి అంబులెన్స్‌లో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అంబులెన్స్‌లోని తెలుగు కుటుంబానికి చెందిన బాజీనగర్  పోలీసుస్టేషన్ హెడ్ కానిస్టేబుల్  గంపా హరిప్రసాదరావు(49), అతని భార్య ఈశ్వరి (42) అక్కడికక్కడే మృతి చెందారు. ముందు కేబిన్‌లో కూర్చున్న ప్రసాదరావు బావమరిది ఎన్.వి.ఎన్. శరత్(ఒడిశాలోని పూరి), విజయవాడకు చెందిన అంబులెన్స్ వైద్య సాంకేతిక నిపుణుడు ఎం.రామకృష్ణ, డ్రైవర్‌గా భావిస్తున్న ఆశీర్వాదం తీవ్రంగా గాయపడ్డారు. వీరిని అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి హైవే పోలీసులు తరలించారు. అక్కడ ప్రాథ మిక చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఆంబులెన్స్ ముందు భాగం దెబ్బతింది. దూరం నుంచి వస్తున్న అంబులెన్స్ డ్రైవర్ కునుకుపాటు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

 అనాథ అయిన కుమార్తె:   హరిప్రసాదరావు, ఈశ్వరిల ఒక్కగానొక గారాల కుమార్తె శ్రీలేఖ తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇప్పుడామె అనాథ అయింది. ఒకేసారి తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు.
 
 

మరిన్ని వార్తలు