బదిలీల జాతర | Sakshi
Sakshi News home page

బదిలీల జాతర

Published Fri, Aug 14 2015 11:39 PM

Ending with today's date

నేటితో ముగియనున్న గడువు
పలుకుబడి లేని వారికి ఏజెన్సీలో పోస్టింగ్
 

మహారాణిపేట(విశాఖ):బదిలీల గడువు నేటితో ముగియనుండడంతో పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్,జెడ్పీల్లోసూపరింటెండెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, టైపిస్టుల బదిలీలకు కౌన్సెలింగ్ మొదలైంది. కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. పంచాయతీ పరిధిలో 300 మంది కార్యదర్శులను మండలం దాటి బదిలీలు చేయనున్నారు. ఇప్పటికీ వీరి జాబితాను సిద్ధం చేసి కలెక్టర్ ఆమోదం కోసం డీపీఓ టి.వెంకటేశ్వర్రావు పంపించారు. వీరితోపాటు కార్యాలయంలో పనిచేస్తున్నసీనియర్ అసిస్టెంట్లు,జూనియర్ అసిస్టెంట్ల బదిలీకి రంగం సిద్ధమైంది. కలెక్టర్ ఆమోదం వచ్చిన వెంటనే వీరికి స్థానాల కేటాయింపు జరుగుతుంది. శనివారం సాయంత్రానికల్లా వీరికి కొత్తస్థానాలు కేటాయించే అవకాశం ఉంది. జిల్లాపంచాయతీ కార్యాలయం పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు డీఎల్‌పీఓలను ఇప్పటికే ప్రభుత్వం బదిలీ చేసింది.

విశాఖ డివిజన్ డీఎల్‌పీఓ మోహన్‌రావును విజయనగరం, పాడేరు డీఎల్‌పీఓ రామ్‌ప్రసాద్, నర్సీపట్నం డీఎల్‌పీఓ పి.సత్యనారాయణను ప్రభుత్వం ఇప్పటికే శ్రీకాకుళం బదిలీ చేసింది. వీరిస్థానంలో శ్రీకాకుళం నుంచి బి.మోహనరావు, బి.ఎం.ఎలీవియా, పి.శిరీషారాణి ఇక్కడకు వస్తున్నారు. వీరికి కలెక్టర్ ఆమోదంతో డివిజన్లు కేటాయిస్తారు. డీపీఓ కార్యాలయంలో పరిపాలనాధికారిగా పనిచేస్తున్న ఆర్.నారాయణరావును శ్రీకాకుళంబదిలీ చేశారు. ఆయన స్థానంలో విజయనగరం నుంచి ఎస్.ఎస్.ఎస్.ఎస్.ఎన్.మూర్తి వస్తున్నారు.
 ఎంపీడీఓ పోస్టులకు గిరాకీ: ఇదిలా ఉండగా జిల్లాలో ఖాళీగా ఉన్న మండలాల్లో ఎంపీడీఓల పోస్టులకు గట్టి పోటీ ఏర్పడింది. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి వారి స్థానాలను ఇప్పటికే రిజర్వ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. భీమిలి, కోటవురట్ల, నర్సీపట్నం, పరవాడ, అనకాపల్లి, సబ్బవరం, యలమంచిలి, నక్కపల్లి మండలాలకు పోటీ ఎక్కువగా ఉండడంతో అవే కావాలని ఎంపీడీఓ అభ్యర్థులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు.

మైదాన ప్రాంతంతో పాటు రోడ్డుపక్కన మండలాల్లో ఎంపీడీఓ పోస్టులకు రేటు ఎక్కువగానే పలుకుతుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని, ఎలాంటి పలుకుబడి లేనివారిని, డబ్బులు ఇచ్చుకోలేని వారిని ఏజెన్సీ ప్రాంతానికి పంపించేందుకు ప్రజాప్రతినిధులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శనివారం స్వాతంత్య్ర వేడుకలు ముగిసిన తరువాత ఈ ఎంపీడీఓ పోస్టుల భర్తీ జరిగే అవకాశం ఉంది. జెడ్పీ పరిధిలో 200మంది వరకు సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టుల బదిలీలకు శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ జయప్రకాశ్‌నారాయణ్, జెడ్పీ చైర్‌పర్సన్ లాలం భవానీ కౌన్సెలింగ్ నిర్వహించారు.

Advertisement
Advertisement